Chanda Kochhar case: ఏడేళ్లు కాదు యావజ్జీవం.. మీరేమంటారు?

16 Oct, 2023 19:00 IST|Sakshi

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లకు సుప్రీం కోర్ట్‌ నోటీసులు జారీ చేసింది. రుణ మోసం కేసులో బాంబే హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను సవాలు చేస్తూ సీబీఐ వేసిన పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు దీనిపై చందా కొచ్చర్‌ దంపతుల స్పందన కోరింది.

న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం సీబీఐ పిటిషన్‌పై చందా కొచ్చర్‌ దంపతులకు నోటీసులు జారీ చేసి మూడు వారాల్లోగా స్పందనను తెలియజేయాలని కోరింది.

సెక్షన్ 409 వర్తిస్తే..
సీబీఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు మాట్లాడుతూ, ఐపీసీలోని సెక్షన్ 409 (ప్రభుత్వ సేవకుడి నేరపూరిత నమ్మక ద్రోహం)ను పరిగణనలోకి తీసుకోకుండా, నేరానికి గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని హైకోర్టు తప్పుగా భావించిందని తెలిపారు. ఈ సెక్షన్‌ ప్రకారం ముద్దాయిలకు పది సంవత్సరాల నుంచి జీవత ఖైదు శిక్ష పడే ఆస్కారం ఉందన్నారు.

ప్రైవేట్ బ్యాంకు అయినప్పుడు ఐపీసీ సెక్షన్ 409 ఎలా వర్తిస్తుందని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. బ్యాంకు ప్రైవేట్‌ కావచ్చు కానీ అందులో ప్రజాధనం ఉంటుందని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సమాధానమిచ్చారు. దీనిపై చందా కొచ్చర్‌ దంపతులకు నోటీసులు జారీ చేసి మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది.

వీడియోకాన్-ఐసీఐసీఐ బ్యాంకు రుణాల మోసం కేసుకు సంబంధించి 2022 డిసెంబర్ 23న చందా కొచ్చర్‌ దంపతులను సీబీఐ అరెస్టు చేసింది. అయితే విచక్షణను ఉపయోగించకుండా యాంత్రికంగా చందా కొచ్చర్‌ దంపతులను సీబీఐ అరెస్ట్‌ చేసిందని ఆక్షేపిస్తూ బాంబే హైకోర్ట్‌ జనవరి 9న వారికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

మరిన్ని వార్తలు