ఎస్‌వీబీ సంక్షోభం: స్టార్టప్‌లకు రిస్కులు తొలగిపోయినట్లే!

16 Mar, 2023 15:50 IST|Sakshi

కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌

న్యూఢిల్లీ: సిలికాన్‌ వ్యాలీ బ్యాంకు (ఎస్‌వీబీ) విషయంలో అమెరికా ప్రభుత్వం సత్వరం చర్య తీసుకున్న నేపథ్యంలో దేశీ స్టార్టప్‌లకు పొంచి ఉన్న రిస్కులు తొలగిపోయినట్లేనని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అభిప్రాయపడ్డారు. భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థను మరింతగా విశ్వసించాల్సిన అవసరం గురించి ఈ సంక్షోభం ఓ పాఠాన్ని నేర్పిందని ఒక ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.

ఎస్‌వీబీ ఖాతాదారులకు సోమవారం నుంచి వారి నగ దు అందుబాటులో ఉంటుందంటూ అమెరికా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో చంద్రశేఖర్‌ ఈ విషయాలు తెలిపారు. ఎస్‌వీబీ ప్రధానంగా స్టార్టప్‌ సంస్థలకు బ్యాంకింగ్‌ సేవలు అందిస్తోంది. అయితే, డిపాజిటర్లు విత్‌డ్రాయల్స్‌కు ఎగబడటంతో సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకున్న బ్యాంకును నియంత్రణ సంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఎస్‌వీబీ బ్రిటన్‌ విభాగాన్ని బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ నామమాత్రంగా 1 పౌండుకు కొనుగోలు చేసేలా తగు చర్యలు తీసుకున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం వెల్లడించింది. తద్వారా 3,000 మంది ఖాతాదారులకు చెందిన 6.7 బిలియన్‌ పౌండ్ల డిపాజిట్లను భద్రత లభిస్తుందని పేర్కొంది.    

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు