‘70 ఉద్యోగాలకు అప్లయ్‌ చేశా.. ఒక్క జాబ్‌ రాలేదు..ఇండియాకి తిరిగి వచ్చేస్తా’

9 Jan, 2023 19:41 IST|Sakshi

అమెజాన్‌, మెటా, గూగుల్‌, ట్విటర్‌, యాపిల్‌ ఇవన్నీ వరల్డ్‌ క్లాస్‌ కంపెనీలు. వీటిల్లో ఏ ఒక్క సంస్థల్లో కొలువు దొరికినా లైఫ్‌ సెటిల్‌ అని అనుకునేవారు. అయితే అదంతా నిన్న మొన్నటి వరకే. ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి స్టార్టప్‌ల వరకు ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఉదయం ఆఫీస్‌కు వెళితే సాయంత్రానికి ఆ జాబ్‌ ఉంటుందో? ఊడుతుందో తెలియని పరిస్థితి. ఇతర సంస్థల సంగతేమో కానీ.. కష్టపడి విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించి.. ఆర్ధిక పరిస్థితులు, ఇతర కారణాలతో ఉద్యోగాలు చేస్తూ హాయిగా గడుపుతున్న భారతీయుల ఉపాధి  పోవడం ప్రస్తుత పరిస్థితులకు ప్రత్యక్ష సాక్షంగా నిలుస్తోంది. 

ప్రపంచ దేశాల్లో .. మరోసారి సంక్షోభం! 2008 తర్వాత.. దాదాపు ఆ స్థాయిలో.. మాంద్యం పరిస్థితులు! వెరసీ ప్రపంచ దేశాల్లో అన్నీ సంస్థల ఆదాయాలు తగ్గిపోతున్నాయి. దీంతో ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఏన్నోఏళ్లుగా తమనే నమ్ముకొని ఉద్యోగాలు చేస్తున్న ఎంప‍్లాయిస్‌కు ఊహించని షాక్‌లిస్తున్నాయి సంస్థలు . సారీ..! మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం’ అంటూ మెయిల్స్‌ పెట్టేయడంతో సదరు ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అలాంటి వారిలో ఒకరైన స్వాతి థాపర్‌ తనకు ఎదురవుతున్న చేదు అనుభవాల్ని నెటిజన్లతో పంచుకున్నారు. 

నెదర్లాండ్‌లో ఏడేళ్ల నుంచి నివాసం ఉంటున్న భారతీయురాలు స్వాతి థాపర్‌ ఉన్నట్లుండి ఉద్యోగం కోల్పోయింది. గతేడాదిలో మే నెలలో ఆర్ధిక మాంద్యంతో ఉద్యోగం పోగొట్టుకుంది. తాను చేస్తున్న కంపెనీ ఫైర్‌ చేయడంతో నాటి నుంచి సుమారు 70కి పై ఉద్యోగాలకు అప్లయ్‌ చేసింది. ఒక్క ఉద్యోగం రాలేదు. చివరికి భారత్‌కు వచ్చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం లింక్డిన్‌ పోస్ట్‌లో ఆమె తన గోడును వెళ్ల బోసుకుంది.   

బైబై నెదర్లాండ్‌
నెదర్లాండ్ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో స్వాతీ థాపర్‌ కాపీ రైటర్‌గా విధులు నిర్వహిస్తుంది. డిపెండెంట్‌ వీసా మీద మార్కెటింగ్‌ స్టార‍్టప్‌లో పనిచేస్తున్న ఆమెను గతేడాది మేలో సంస్థ ఫైర్‌ చేసింది. అప్పటి నుంచి ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్నా సక్సెస్‌ కాలేకపోతుంది. అందుకే  7ఏళ్లగా ఉంటున్న నెదర్లాండ్‌ కు గుడ్‌బై చెప్పి భారత్‌కు వచ్చేయాలని అనుకుంటున్నట్లు తన పోస్ట్‌లో పేర్కొంది. 

రోజులు..నెలలు.. కాస్తా 3 ఏళ్లు అయ్యాయి
రాజస్థాన్‌లో ఉండే థాపర్‌కు 2016లో పెళ్లైంది. ఉన్నత ఉద్యోగం చేస్తున్న భర్తతో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఎన్నో కలలతో భారత్‌ నుంచి నెదర్లాండ్‌కు వెళ్లిన ఆమెకు.. తాను కన్న కలలు కన్నీళ్లను మిగుల్చుతాయని ఊహించలేదు. వైవాహిక జీవితం అంతా బాగుంది. కానీ ఉద్యోగం మాత్రం అంత ఈజీగా రాలేదు. చిన్న వయస్సు నుంచి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్లో చదవడం వల్ల ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతుంది. రాస్తుంది. 

కానీ టెక్నాలజీ విభాగంలో అపారమైన అవకాశాలు ఉండే నెదర్లాండ్‌లో ఉద్యోగం సంపాదించడం కత్తిమీద సామైంది. టెక్ రంగంలో కాపీ రైటర్‌గా ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది. రోజులు, నెలలు కాస్త 3 సంవత్సరాలయ్యాయి. ఇంటర్వ్యూలో అనేక అవమానాలు, చీత్కరింపులు.. అన్నింటిని పంటి బిగువున దిగమింగుకుంది. లెక్కలేనన్ని తిరస్కరణల తర్వాత చాలా కంపెనీలు బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు చెందిన వారు, ఇంగ్లీష్ మాట్లాడే వారిని మాత్రమే ఉద్యోగంలోకి తీసుకుంటాయని తెలుసుకుంది. ఎట్టకేలకు 3 ఏళ్ల తర్వాత ఫ్రీలాన్స్ రైటింగ్, స్టార్టప్‌లో మార్కెటింగ్ కాపీ రైటర్‌గా ఉద్యోగం సంపాదించింది.  

జాబ్‌ పోయింది
కానీ కోవిడ్‌ మహమ్మారి కారణంగా జాబ్‌ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.  2020 ప్రారంభం నుంచి థాపర్‌ జాబ్‌ చేస్తున్న కంపెనీ పరిస్థితులు బాగలేదు. చాలా మంది ఉద్యోగులు జాబ్‌కు రిజైన్‌ చేస్తున్నారు. సీఈవో శాలరీలు ఇచ్చేందుకు బ్యాంక్‌ లోన్‌ తీసుకుని చెల్లిస్తున్నట్లు తెలుసుకుంది. అప్పుడే గర్భవతిగా ఉన్న ఆమె 2021 అక్టోబర్‌లో మెటర్నీటీ లీవ్‌ పెట్టింది. తిరిగి  జనవరి 2022లో జాబ్‌లో రీజాయిన్‌ అయ్యింది. 25 మంది ఉద్యోగులు సంఖ్య 2కు చేరింది. చివరికి ఆమెను కూడా అదే ఏడాది మేలో ఉద్యోగం నుంచి తొలగించినట్లు చెప్పింది. 

70 ఉద్యోగాలకు అప్లయ్‌ చేశా
ఉద్యోగం పోవడంతో .. కొత్త జాబ్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ‘అప్పటి నుంచి ఇప్పటి వరకు 70 ఉద్యోగాలకు అప‍్లయ్‌ చేశా. ఇంకా చేస్తూనే ఉన్నా. ఒక్క ఉద్యోగం రాలేదు. లింక్డ్‌ఇన్‌లో రిక్రూటర్‌లతో మాట్లాడాను. అదనపు స్కిల్స్‌ కోసం కోర్స్‌వర్క్, కెరీర్ కోచింగ్, మెంటరింగ్ కోసం ఖర్చు చేశా. ఫలితం దక్కలేదు. చివరికి డిప్రెషన్‌కు గురయ్యాను. ప్రొఫెషనల్‌గా నాపై నాకున్న నమ్మకం కూడా పోయింది. 2016తో పోలిస్తే ఇప్పుడు నెదర్లాండ్స్‌లో ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఆర్ధిక మాద్యం, అన్నీ రంగాల్లో లేఫ్స్‌ కారణంగా కొత్త ఉద్యోగం సంపాదించడంలో కష్టపడాల్సి వస్తుంది.

కొడుకు భవిష్యత్‌ కోసం
సంవత్సరాల తరబడి ఇక్కడే ఉన్నందు వల్ల పౌరసత్వం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేదు. భర్త జాబ్‌ చేస్తున్నారు కాబట్టి ఆర్ధిక సమస్యలా లేవు. కానీ ఖర్చులు పెరిగాయి. ఇల్లు, కారు అన్నీ తీసుకున్నాం. దాచుకున్న డబ్బులు అయిపోయాయి. ఎక్కువ డబ్బులు అవసరమే. అలా అని భర్తమీద ఆధారపడలేను. కొడుకు భవిష్యత్‌ కోసం ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నా. ఒక వేళ ఉద్యోగం దొరక్కపోతే ఇండియాకు తిరిగి వచ్చేస్తాను అంటూ నెటిజన్లతో పంచుకుంది.

చదవండి👉 వందల మంది ఉద్యోగం ఊడింది..‘2 నెలల జీతం ఇస్తాం..ఆఫీస్‌కు రావొద్దు’

మరిన్ని వార్తలు