స్విగ్గీ డెలివరీ మ్యాన్‌ విషాదం: తండ్రి అలా, కొడుకు ఇలా..!

12 Sep, 2022 10:15 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్విగ్గీ  డెలివరీ మ్యాన్‌ దుర్మరణం పాలైన ఘటన విషాదాన్ని నింపింది. ఒక మైనర్‌ నిర్ల్యక్షం గోలే మార్కెట్‌కు చెందిన రాహుల్‌ కుమార్‌ని బలి తీసుకుంది. దేశ్ బంధు గుప్తా రోడ్డు వద్ద శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. 

అతివేగంతో ఎంజీ హెక్టార్‌(ఎస్‌యూవీ) కారును నడపడంతో అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టాడు. ఆ తరువాత కారును అక్కడే వదిలేసి అక్కడినుంచి ఉడాయించాడు. ఈ ఘటనలో  స్విగ్గీ డెలివరీ మ్యాన్ రాహుల్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించి నప్పటికీ ఫలితంలేదు. చికిత్స పొందుతూ రాహుల్‌ మరణించాడు. బైక్‌పై వెనుక కూర్చున్న రాహుల్‌ స్నేహితుడు పవన్‌ కుమార్‌ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు.

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు ఇంటర్‌ విద్యార్థి, మైనర్‌ బాలుడు కారును నడుపుతున్నాడు. కారులో నిందితుడితోపాటు,  అతని స్నేహితుడు,  మరో విదేశీ పౌరుడు  కూడా ఉన్నారు.  ఘటనాస్థలంలో వదిలేసి పారిపోయిన కారు ఆధారంగా రవాణా శాఖ సమాచారంతో  నిందితుడ్ని అదుపులోకి  తీసుకున్నారు. 

నిందితుడి తండ్రి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అంతేకాదు కోట్లా రూపాయల కుంభకోణంలో కొన్ని నెలల క్రితం అరెస్టయినట్టు పోలీసుల సమాచారం ద్వారా తెలుస్తోంది.   ఈ విషయం తెలిసిన బాధితుడి స్నేహితులు, తండ్రి అలా, కొడుకు ఇలా  అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు