స్విగ్గీకి షాక్‌! రూ.4.50 జీఎస్టీకి... రూ.20వేల ఫైన్‌

9 Jul, 2021 17:10 IST|Sakshi

పంచకుల(హర్యానా): ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీకి షాక్‌ తగిలింది! కస్టమర్‌ నుంచి అనుచితంగా పన్ను వసూలు చేశారంటూ వినియోగదారుల ఫోరం ఫైర్‌ అయ్యింది. అనవసరంగా పన్ను విధించినందుకు, వినియోగదారున్ని మానసిక వేధనకు గురి చేసినందుకు భారీగా ఫైన్‌ విధించింది. 

కన్సుమర్‌ గూడ్స్‌ యాక్ట్‌ 2006
హర్యానాలోని పంచకులకు చెందిన అభిషేక్‌ గార్గ్‌ స్విగ్గీ ద్వారా స్విగ్గీ మొబైల్‌యాప్‌ ద్వారా చీజ్‌ గార్లిక్‌ స్టిక్‌తో పాటు మూడు సాఫ్ట్‌ డ్రింక్స్‌ ఆర్డర్‌ చేశాడు. ఇందులో గార్లిక్‌ స్టిక్‌కి రూ. 144, కూల్‌డ్రింక్స్‌కి రూ.90లు అయ్యింది. అయితే బిల్‌ వచ్చిన తర్వాత పరిశీలిస్తే సాఫ్ట్‌డ్రింక్స్‌కి ప్రత్యేకంగా రూ. 4.50 జీఎస్‌టీగా స్విగ్గీ వసూలు చేసినట్టు గమనించాడు. కొనుగోలు చేసిన వస్తువులకు ఎంఆర్‌పీ చెల్లించిన తర్వాత ప్రత్యేకంగా కూల్‌డ్రింక్‌కి జీఎస్‌టీ వసూలు చేయడం కన్సుమర్‌ గూడ్స్‌ యాక్ట్‌ 2006 ప్రకారం చట్ట విరుద్ధమని పేర్కొంటూ పంచకుల వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. 

మా తప్పేం లేదు
అయితే తాము కేవలం మధ్యవర్తులమేనని, సాఫ్ట్‌డ్రింక్‌ అమ్మకం దారు పాలసీకి అనుగుణంగానే జీఎస్‌టీ వసూలు చేశామని, తమ సేవల్లో లోపం లేదంటూ పేర్కొంది. అయితే స్విగ్గీ వాదనలు విన్న ఫోరం మండిపడింది. స్విగ్గీ ఏమీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ కాదని, వినియోగదారు, అమ్మందారుల మధ్యవర్తిగా ఉంటూ డెలివరీ పనులు నిర్వహిస్తోందని పేర్కొంది. 

రూ. 20,000 ఫైన్‌ కట్టండి
చట్ట విరుద్ధంగా సాఫ్ట్‌డ్రింక్‌పై జీఎస్‌టీగా రూ. 4.50 వసూలు చేయడాన్ని తప్పు పట్టింది. అదనంగా వసూలు చేసిన రూ. 4.50 పైసలు 9 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు కోర్టు, ఇతర ఖర్చుకు గాను అభిషేక్‌ గార్గ్‌కి రూ. 10,000 చెల్లించాలంది. దీంతో పాటు జరిగిన పొరపాటుకు జరిమానాగా రూ. 10,000 హర్యాణా స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ చైల్డ్‌ వేల్ఫేర్‌కి డిపాజిట్‌ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.  

మరిన్ని వార్తలు