15 నిమిషాల్లోనే సరుకులు డోర్ డెలివరీ: స్విగ్గీ

3 Dec, 2021 21:30 IST|Sakshi

న్యూఢిల్లీ: నిత్యావసరాల డెలివరీ సర్వీసుల విభాగం ఇన్‌స్టామార్ట్‌పై దాదాపు 700 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 5,250 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ తెలిపింది. గతేడాది గురుగ్రామ్, బెంగళూరులో ప్రారంభమైన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ ప్రస్తుతం హైదరాబాద్, వైజాగ్‌తో పాటు 18 నగరాల్లో సర్వీసులు అందిస్తోంది. తాజా పళ్లు, కూరగాయలు, బ్రెడ్, గుడ్లు మొదలైన వాటిని ఇన్‌స్టామార్ట్‌ త్వరితగతిన కస్టమర్లకు అందిస్తోంది. వారానికి 10 లక్షల పైగా ఆర్డర్లను డెలివరీ చేస్తున్నట్లు స్విగ్గీ తెలిపింది.

2022 జనవరి నాటికి మెజారిటీ కస్టమర్లకు సమీపంలో ఉండే స్టోర్లతో నెట్‌వర్క్‌ ఏర్పర్చుకోవడం ద్వారా 15 నిమిషాల్లోనే సరుకులు అందించనున్నట్లు పేర్కొంది. సాధారణంగా సాంప్రదాయ ఈ-కామర్స్‌ పద్ధతిలో ఉత్పత్తుల డెలివరీకి ఒక రోజుపైగా పట్టొచ్చని, క్విక్‌ కామర్స్‌ (క్యూ-కామర్స్‌)తో తక్కువ పరిమాణాల్లోని ఉత్పత్తులనూ చాలా తక్కువ సమయంలో కస్టమర్లకు అందించొచ్చని వివరించింది. క్యూ-కామర్స్‌ విభాగంలో జొమాటోకి చెందిన గ్రోఫర్స్, డన్‌జో తదితర సంస్థలతో ఇన్‌స్టామార్ట్‌ పోటీపడుతుంది. దేశీయంగా క్యూ-కామర్స్‌ రంగం విలువ ప్రస్తుతం 0.3 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. 2025 నాటికి ఇది 5 బిలియన్‌ డాలర్లకు చేరగలదని కన్సల్టింగ్‌ సంస్థ రెడ్‌సీర్‌ ఒక నివేదికలో తెలిపింది.

(చదవండి: డేటా గోప్యత, క్రిప్టో కరెన్సీ బిల్లులపై ముఖేష్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు!)

>
మరిన్ని వార్తలు