ఇక నుంచి ఆన్‌లైన్‌లో స్ట్రీట్‌ ఫుడ్‌

22 Feb, 2021 18:10 IST|Sakshi

స్విగ్గీతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఎంఓయూ

తొలుత 9 పురపాలికల్లో అమలు 

వీధి వ్యాపారులకు నాణ్యతపై శిక్షణ  

సాక్షి, హైదరాబాద్‌: మీకు స్ట్రీట్‌ఫుడ్‌ అంటే ఇష్ట మా? తోపుడు బండ్లు, చిన్న స్టాల్స్‌లో విక్రయిం చే ఇడ్లీ, దోశ, మిర్చీ బజ్జీ, పానీపూరి, కట్లెట్, పావ్‌బాజీ వంటి వాటిని ఇష్టంగా లాగిస్తుంటారా? అయితే ఇకపై మీరు వీధి వ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాలను సైతం ఎంచక్కా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చి ఇంటికి తెప్పించుకోవచ్చు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని చిన్న నగరాలు, పట్టణాల్లో సైతం ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీధి వ్యాపారుల ఆహార పదార్థాలకు ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్లు స్వీకరించి వినియోగదారులకు డెలివరీ చేయడానికి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల స్విగ్గీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 

ప్రస్తుతం ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సర్టిఫికెట్‌గల హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్లు స్వీకరించి ఆహారాన్ని డెలివరీ చేయడానికి మాత్రమే ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ సేవలు అందుబాటులోకి ఉన్నాయి. తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్విగ్గీతో చేసుకున్న ఒప్పందంతో రోడ్డు పక్కన ఉండే తోపుడు బండ్లు, స్టాల్స్‌లలో ఆహార పదార్థాలు విక్రయించే వీధి వ్యాపారులకు సైతం ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

సురక్షిత ఆహారం తయారీపై శిక్షణ.. 
ఈ కార్యక్రమంలో భాగంగా సురక్షిత ఆహారం తయారీపై ‘ఫుడ్‌ సేఫ్టీ ట్రైనింగ్‌ అండ్‌ సర్టిఫికేషన్‌’(ఎఫ్‌ఓఎస్‌టీఏసీ) ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు ఆన్‌లైన్‌ శిక్షణ అందనుంది. అలాగే పాన్, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) రిజిస్ట్రేషన్‌ పొందడంలో సహకారం, స్విగ్గీ యాప్‌ వినియోగంలో శిక్షణ లభించనుంది. డిజిటల్‌ మెనూ రూపకల్పన, ధరల ఖరారు వంటి అంశాల్లోనూ ఎఫ్‌ఓఎస్‌టీఏసీ అవగాహన కల్పించనుంది. ప్రస్తుతం చాలా చోట్ల వీధివ్యాపారులు వార్తాపత్రికల్లో ఆహార పదార్థాలను ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తుండగా ఇకపై అలా కాకుండా ఆహార భద్రతా ప్రమాణాల మేరకు సురక్షిత ప్యాకింగ్‌ పద్ధతులపై వారికి శిక్షణ ఇవ్వనుంది. ఒక్కో వీధి వ్యాపారికి శిక్షణ ఖర్చుల కోసం కేంద్ర గృహ నిర్మాణ శాఖ రూ.700 చెల్లించనుంది. ఎఫ్‌ఓఎస్‌టీఏసీ సంస్థ ఆన్‌లైన్‌ ద్వారా 4 గంటల శిక్షణ అందించనుంది.  

చిన్న నగరాల్లో సైతం... 
ప్రస్తుతానికి జీహెచ్‌ఎంసీతోపాటు గ్రేటర్‌ వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్లు, సూర్యాపేట, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌ మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ నిర్ణయించింది. ఆయా నగరాలు, పట్టణాల మెప్మా మిషన్‌ కో-ఆర్డినేటర్లకు ఈ కార్యక్రమం అమలు బాధ్యతను అప్పగించింది. మార్చిలోగా ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసిన 9 పురపాలికల్లో అమల్లోకి తీసుకురానున్నారు. స్ట్రీట్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేసే వినియోగదారులపై కనీసం రూ. 25 వరకు సర్వీసు చార్జీలు విధించనున్నారని, దీని ద్వారా ఆయా పట్టణాల్లో చాలా మంది నిరుద్యోగ యువతకు డెలివరీ బాయ్స్‌గా ఉద్యోగావకాశాలు లభిస్తాయని పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి.

చదవండి:
భారీగా పెరిగిన ఉల్లి ధర

గోల్డ్ లోన్ తీసుకునేవారికి ఎస్‌బీఐ బంపర్ ఆఫర్

మరిన్ని వార్తలు