Swiggy, Zepto: లేట్‌ నైట్‌ అయినా సరే.. చిటికెలో డెలివరీ!

15 Sep, 2022 09:19 IST|Sakshi

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ కొత్త ప్రయత్నం 

ఇదే బాటలో జెప్టో అడుగులు 

గ్రోసరీ ఈ కామర్స్‌లో మరింత పోటీ 

న్యూఢిల్లీ: అర్ధరాత్రి సమయంలోనూ కిరాణా సరుకులు మీ ఇంటికి చేర్చే రోజు వస్తుందని ఊహించారా..? దీన్ని నిజం చేసింది స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌. గ్రోసరీ విభాగంలో ఈ కామర్స్‌ సంస్థల మధ్య పోటీ మామూలు స్థాయిలో లేదనడానికి ఇదొక తాజా ఉదాహరణ. కస్టమర్ల అవసరాలను తీర్చడం, మార్కెట్‌ వాటా పెంచుకోవడం ఈ రెండు అంశాలే ప్రామాణికంగా గ్రోసరీ ఈ కామర్స్‌ సంస్థలు వ్యూహాలను అమలు చేస్తున్నాయి. (వావ్‌​..అదరహో! ఎలైట్‌ క్లబ్‌లోకి ఎస్‌బీఐ ఎంట్రీ)

పోటీ తీవ్రంగా ఉండడం వల్లే 10 నిమిషాల్లో డెలివరీ సదుపాయం పుట్టుకొచ్చింది. ఆర్డర్‌ చేసి, టీ తాగేలోపే కిరాణా సరుకులు తెచ్చివ్వడం కస్టమర్లను సైతం ఆశ్చర్చచకితులను చేసిందని చెప్పుకోవాలి. ఇలా కొత్త ఆలోచనలతో పోటీ సంస్థలపై పైచేయి సాధించేందుకు కంపెనీలు ఎత్తులు వేస్తున్నాయి. ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ అనుబంధ గ్రోసరీ సంస్థ ఇన్‌స్టామార్ట్‌.. తెల్లవారుజాము వరకు గ్రోసరీ డెలివరీకి శ్రీకారం చుట్టింది. పరిశ్రమలో ఈ సేవలు ప్రారంభించిన మొదటి సంస్థగా నిలిచింది. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ముందుగా ఈ సేవలను అందిస్తోంది.  (షాపింగ్‌ మాల్స్‌ సందడి, ఎన్ని పెరిగాయో తెలుసా?)  

3 గంటల వరకు..  
‘‘తెల్లవారుజామున మూడు గంటల వరకు మా సేవలు తెరిచే ఉంటాయి. అప్పటివరకు మీకు కావాల్సిన వాటిని డెలివరీ చేస్తుంటాం’’ అంటూ తన కస్టమర్లకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ సందేశాలు పంపించింది. జూన్‌ వరకు చివరి 12 నెలల్లో ఆర్డర్ల పరంగా ఇన్‌స్టామార్ట్‌ 16 రెట్ల వృద్ధిని చూసింది. బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి.

‘‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ దేశవ్యాప్తంగా 25 పట్టణాల్లో ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఒంటి గంట వరకు సేవలు అందిస్తోంది. స్టోర్‌ ఆపరేటర్లు, డెలివరీ భాగస్వాముల సహకారంతో కొన్ని పట్టణాల్లో మా కార్యకలాపాల సమయాన్ని మరింత పెంచుతున్నాం. కస్టమర్ల కోరిక మేరకు 5,000 ఉత్పత్తుల్లో కోరిన దాన్ని డెలివరీ చేస్తున్నాం’’అని స్విగ్గీ అధికార ప్రతినిధి తెలిపారు.  

జెప్టో సైతం..
ఈ విషయంలో జెప్టో సైతం స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు గట్టి పోటీనిచ్చేలా ఉంది. రోజంతా డెలివరీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్టు తెలిపింది. ‘‘మేము ఇప్పటికే 10 పట్టణాల్లో అర్ధరాత్రి 1 గంట వరకు డెలివరీ సేవలను ఆఫర్‌ చేస్తున్నాం. ఇప్పుడు 24 గంటల పాటు సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. ఇది ఇంకా ఆరంభంలోనే ఉంది. కాకపోతే రాత్రి పూట ఆర్డర్లలో క్రమంగా వృద్ధి కనిపిస్తోంది’’ అని జెప్టో అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘‘క్విక్‌ కామర్స్‌ కంపెనీలు రాత్రి డెలివరీలో పైచేయి సాధించగలవు. వాటికున్న డార్క్‌ స్టోర్లు, మినీ స్టోర్ల నెట్‌వర్క్‌ ద్వారా ఈ సేవలు ఆఫర్‌ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. 15-30 నిమిషాల్లోనే డెలివరీ చేయగలవు. బయటి విక్రయదారులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు’’ అని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. అయితే, ఈ సేవలు ఎంతకాలం పాటు కొనసాగగలవు? అన్నదే  ప్రశ్నగా పేర్కొన్నాయి. 
 

మరిన్ని వార్తలు