Hi Tech Flooring: నానోజెనెరేటర్‌.. ఈ చెక్క ఫ్లోర్‌పై నడిస్తే చాలు!

6 Sep, 2021 16:58 IST|Sakshi

అడుగేస్తే మాస్‌, భూకంపం, దడదడా.. ఇలాంటి డైలాగులు అతిశయోక్తి కోసం సినిమాల్లో వాడుతుంటారు. కానీ, అడుగేస్తే నిజంగా కరెంట్‌పుడితే? ఎలా ఉంటుంది. ‘పవర్‌ వాక్‌’.. ఈ పదం ఎప్పుడైనా విని ఉన్నారా? స్విస్‌ సైంటిస్టుల చొరవతో త్వరలో ఇది నిజం కాబోతోంది.    

చెక్క ఫ్లోరింగ్‌, సిలికాన్‌ కలయిక ద్వారా ఎలక్ట్రిక్ ప్రొడక్షన్‌ ప్రారంభించే దిశగా ‘అడుగు’లు పడబోతున్నాయి. జూరిచ్‌(స్విట్జర్‌ల్యాండ్‌)కు చెందిన ఈటీహెచ్‌ జూరిచ్‌ పబ్లిక్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు ఈ ప్రయోగాల్లో తొలి ప్రయత్నంలో సక్సెస్‌ అయ్యారు. నానోజనరేటర్‌ పేరుతో తయారు చేసిన డివైజ్‌ ఆధారంగా లో వోల్టేజ్‌ కరెంట్‌ను ఉత్పత్తి చేయగలిగారు.  నానో క్రిస్టల్స్‌ను పొందుపరిచిన చెక్కఫ్లోర్‌, దానికి సిలికాన్‌ కోటింగ్‌తో డివైజ్‌ను రూపొందించారు. ఈ డివైజ్‌పై అడుగువేయగానే ఒత్తిడి.. ఎలక్ట్రాన్ల ప్రవాహం వల్ల కరెంట్‌ ఉత్పత్తి అవుతుంది.
 
ఈ కరెంట్‌తో ఎల్‌ఈడీ బల్బ్స్‌, చిన్న ఎలక్ట్రిక్ డివైజ్‌లను పని చేసేలా చేశారు. ట్రైబోఎలక్ట్రిక్ ఎఫెక్ట్‌.. అంటే ఎలక్ట్రాన్లను ఏ మెటీరియల్‌ అయితే కోల్పోతోందో అది ట్రైబో పాజిటివ్‌.. ఏదైనా పొందుతుందో అది ట్రైబో నెగెటివ్‌. ఈ సూత్రం ఆధారంగానే నానోజెనెరేటర్‌ పని చేస్తుంది. చెక్క ఫ్లోర్‌ ఎలక్ట్రాన్‌లను ఆకర్షించడం, వికర్షించడం.. మీద ఆధారపడి ఇది పని చేయనుంది. దీనిని మరింత మెరుగ్గా(మనిషికి ప్రమాదం జరగని స్థాయి) తీర్చిదిద్ది ఇంటి అవసరాలకు, తక్కువ స్పేస్‌లో ఉపయోగించనున్నట్లు ప్రొఫెసర్‌ గుయిడో పంజరసా చెబుతున్నారు.

చదవండి: కరోనా పేషెంట్ల ప్రాణాలను కాపాడే టూల్‌.. మనోడి సత్తా

మరిన్ని వార్తలు