చిప్స్‌ కంపెనీలకు క‘న్నీటి’ కష్టాలు 

7 May, 2021 00:25 IST|Sakshi

చేతులెత్తేసిన తైవాన్‌లోని కంపెనీలు 

మంచి నీరు లేక నిలిచిన తయారీ 

వందలాది విభాగాలపై ప్రభావం 

క్రమంగా పెరుగుతున్న ధరలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇప్పటివరకు చిప్స్‌ కొరత ప్రపంచవ్యాప్తంగా వాహన తయారీదార్లను ఇబ్బందులకు గురిచేసింది. ఇప్పుడు ఈ సమస్య ఇతర పరిశ్రమలకూ పాకింది. మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ఏసీలు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, యంత్రాలు, సర్వర్స్, బొమ్మలు.. ఇలా ఒక్కటేమిటి. వందలాది విభాగాలపై సెమికండక్టర్స్‌ కొరత తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు మొదలుకొని స్టార్టప్స్‌ వరకూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో అంతిమంగా కస్టమర్లపైనే భారం పడుతోంది. వస్తువుల ధర పెరగడంతోపాటు వీటిని అందుకోవడం కోసం వినియోగదార్లు వేచి చూడాల్సి వస్తోంది. దుకాణాల్లో నిల్వలు నిండుకుంటున్నాయి. 

స్వచ్ఛమైన నీటి కొరతతో.. 
చిప్స్‌ ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉన్న తైవాన్‌ వాటా 70 శాతముంది. క్వాల్‌కామ్‌ సహా పలు దిగ్గజాలకు చిప్స్‌ను సరఫరా చేస్తున్న తైవాన్‌ సెమికండక్టర్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ (టీఎస్‌ఎంసీ) వాటా పరిమాణం పరంగా ఏకంగా 55 శాతం ఉందని కౌంటర్‌పాయింట్‌ తెలిపింది. యునైటెడ్‌ మైక్రోఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్, వాన్‌గార్డ్‌ ఇంటర్నేషనల్‌ సెమికండక్టర్‌ కార్పొరేషన్, పవర్షిప్‌ సెమికండక్టర్‌ వంటి కంపెనీలూ ఇక్కడివే. అయితే వర్షాలు లేక 56 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర కరువు పరిస్థితులు తైవాన్‌ను చుట్టుముట్టాయి. సెమికండక్టర్స్‌ ఉత్పత్తి ప్రక్రియలో అత్యంత స్వచ్ఛమైన మంచి నీటిని వాడతారు. ఇప్పుడీ నీటికి కరువు ఏర్పడడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. 

రెండు దశాబ్దాల్లో.. 
చిప్‌ కొరతతో పలు దేశాల్లో ప్యాసింజర్‌ కార్ల రంగంలో కొన్ని కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేయగా, మరికొన్ని తయారీ తగ్గించాయి. దీంతో ఈ సంస్థల అమ్మకాలూ తక్కువ నమోదయ్యాయి. సెమికండక్టర్ల కొరత కొన్నేళ్లు ఉంటుందని ఇంటెల్‌ కార్పొరేషన్‌ సీఈవో ప్యాట్‌ జెల్సింగర్‌ తెలిపారు. కొరత కారణంగా వ్యాపార అవకాశాలు మందగిస్తున్నాయని కంపెనీలు అంటున్నాయి. ఎలక్ట్రానిక్స్‌ ముడిసరుకు ధర మార్చిలో భారీగా పెరిగింది. ఈ పెరుగుదల గడిచిన రెండు దశాబ్దాల్లో ఇదే అత్యధికమని మార్కెట్‌ రీసెర్చ్‌ కంపెనీ ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ వెల్లడించింది. ఇళ్లలో వినియోగించే గ్యాడ్జెట్స్‌ కోసం కస్టమర్లు గతేడాది ఎగబడడంతో కంపెనీలకు చిప్స్‌ అవసరం మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్‌ కోసం డిమాండ్‌ విపరీతంగా ఉంది. భారత్‌లో ల్యాప్‌టాప్స్, ఏసీలకు కొరత ఏర్పడింది. డిమాండ్‌తో పోలిస్తే ల్యాప్‌టాప్స్‌ 10 శాతమే సరఫరా అవుతున్నాయని ఐటీ మాల్‌ ఎండీ మొహమ్మద్‌ అహ్మద్‌ తెలిపారు. 


అన్ని కంపెనీలకూ సమస్యే.. 
తాజా పరిస్థితుల నేపథ్యంలో హార్డ్‌వేర్‌ అమ్మకాలు తగ్గాయని మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. ప్రస్తుత త్రైమాసికంలో ట్యాబ్లెట్స్, ల్యాప్‌టాప్స్‌ విక్రయాలు తగ్గే అవకాశం ఉందని యాపిల్‌ ఫైనాన్స్‌ చీఫ్‌ లూకా మాయెస్ట్రీ తెలిపారు. గోల్డ్‌మన్‌ శాక్స్‌ గ్రూప్‌ నివేదిక ప్రకారం యూఎస్‌లో బోట్‌ బిల్డింగ్, బ్రూవరీస్, ఫాబ్రిక్‌ మిల్స్‌ వంటి సుమారు 170 పరిశ్రమలు ప్రత్యక్షంగా సమస్యను ఎదుర్కొంటున్నాయట. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా చిప్‌ కొరత ప్రభావం ఉంటోందని నివేదిక వెల్లడించింది. చిప్స్, ఇతర ముడిసరుకు కొరత కారణంగా ఉత్పత్తుల ధరను 5–12 శాతం పెంచుతున్నట్టు వర్ల్‌పూల్‌ సీఈవో మార్క్‌ బిజర్‌ తెలిపారు. ఏడాది చివరికల్లా పరిస్థితుల్లో మార్పు రావొచ్చని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ హోమ్‌ అప్లయెన్సెస్, ఎయిర్‌ సొల్యూషన్స్‌ బిజినెస్‌ యూనిట్‌ హెడ్‌ డాన్‌ క్వాక్‌ వెల్లడించారు. హోమ్‌ అప్లయెన్సెస్‌ తయారీలో 1,000కిపైగా విభిన్న సెమికండక్లర్టను వినియోగిస్తున్నట్టు చెప్పారు.

ఇదీ సెమికండక్టర్స్‌ పరిశ్రమ.. 
ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సెమికండక్టర్ల పరిశ్రమ విలువ సుమారు రూ.32.7 లక్షల కోట్లు ఉంది. ప్రస్తుత సంవత్సరం 1.13 ట్రిలియన్‌ యూనిట్ల సెమికండక్టర్లు అమ్ముడవుతాయని అంచనా. 2020తో పోలిస్తే ఇది 13 శాతం వృద్ధి అని ఈ రంగంలో ఉన్న రీసెర్చ్‌ సంస్థ ఐసీ ఇన్‌సైట్స్‌ తెలిపింది. 2019తో పోలిస్తే గతేడాది అమ్మకాల వృద్ధి కేవలం 3 శాతమే. ఇక యూఎస్‌కు చెందిన ఇంటెల్‌ ప్రీమియం చిప్స్‌ తయారీలో ఉంది. శామ్‌సంగ్, ఎస్‌కే హైనిక్స్, బ్రాడ్‌కామ్, క్వాల్‌కామ్, మైక్రాన్‌ వంటి కంపెనీలు ఈ రంగంలో ఉన్నాయి.

చదవండి: ఆటో, ఐటీ, మెటల్ మెరుపులు: లాభాల ముగింపు

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు