అమ్మకానికి మరో ఆరు సంస్థలు... కేంద్రం కసరత్తు

18 Nov, 2021 05:00 IST|Sakshi

పీఎస్‌యూల ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతం

జనవరిలోగా ఆరు సంస్థల ఫైనాన్షియల్‌ బిడ్లకు ఆహ్వానం 

 జాబితాలో బీపీసీఎల్, బీఈఎంఎల్‌ తదితర కంపెనీలు

డిజిన్వెస్ట్‌మెంట్‌ విభాగం కార్యదర్శి పాండే వెల్లడి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఆరు సంస్థల (సీపీఎస్‌ఈ) ప్రైవేటీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఇందుకోసం డిసెంబర్‌–జనవరిలోగా ఫైనాన్షియల్‌ బిడ్లను ఆహ్వానించాలని కేంద్రం భావిస్తోంది. డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియకు సంబంధించిన పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే బుధవారం ఈ విషయాలు తెలిపారు. ‘దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ ఏడాది 5–6 సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ చూడబోతున్నాం. బీపీసీఎల్‌ మదింపు ప్రక్రియ జరుగుతోంది. దీనితో పాటు బీఈఎంఎల్, షిప్పింగ్‌ కార్పొరేషన్, పవన్‌ హన్స్, సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్, ఎన్‌ఐఎన్‌ఎల్‌ ఆర్థిక బిడ్లను డిసెంబర్‌–జనవరిలోనే ఆ హ్వానించవచ్చు’ అని ఆయన వివరించారు. బీమా రంగ దిగ్గజం ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి–మార్చి) ఉండవచ్చని చెప్పారు. సీఐఐ గ్లోబల్‌ ఎకనామిక్‌ పాలసీ సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా పాండే ఈ విషయాలు వివరించారు. అటు విమానయాన సంస్థ ఎయిరిండియాను డిసెంబర్‌లోగా కొనుగోలుదారుకు అప్పగించడం పూర్తవుతుం దని పేర్కొన్నారు. వేలంలో సుమారు రూ. 18,000 కోట్లకు ఎయిరిండియాను టాటా గ్రూప్‌ సంస్థ టాలేస్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎయిరిం డియా విక్రయం పూర్తవడంతో సీపీఎస్‌ఈల ప్రైవేటీకరణ మరింత వేగవంతం కాగలదని పాండే చెప్పారు. ఇందుకోసం ప్రైవేట్‌ రంగం నుంచి కూడా సహకారం అవసరమని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉప సంహరణ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా రూ.9,300 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. ఈ నేపథ్యంలోనే ఎల్‌ఐసీ లిస్టింగ్‌పై ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతోంది.
రిస్కులు తీసుకోండి
సామర్థ్యాలు పెంచుకునేందుకు ఇన్వెస్ట్‌ చేయండి
దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించండి
పరిశ్రమ వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పిలుపు

న్యూఢిల్లీ: కరోనాపరమైన సవాళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో రిస్కులు తీసుకోవాలని, సామర్థ్యాల పెంపుపై మరింతగా పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమ వర్గాలకు ఆమె పిలుపునిచ్చారు. తద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. ‘సామర్థ్యాలను పెంచుకోవడంలోనూ, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలోను, టెక్నాలజీని ఇచ్చే భాగస్వాములతో చేతులు కలపడంలోనూ భారతీయ పరిశ్రమ మరింత జాప్యం చేయొద్దని కోరుతున్నాను’ అని సీఐఐ గ్లోబల్‌ ఎకనమిక్‌ పాలసీ సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా సీతారామన్‌ తెలిపారు.

దేశీయంగా తయారీ కోసం విడిభాగాలు, పరికరాలను దిగుమతి చేసుకోవడం వల్ల సమస్యేమీ లేదని.. కాని పూర్తి స్థాయి ఉత్పత్తుల దిగుమతులను మాత్రం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల రిస్కులు ఉన్నందున.. దీనిపై పునరాలోచించాలని అభిప్రాయపడ్డారు. ‘మన దగ్గర మార్కెట్‌ ఉన్నప్పుడు, కొన్ని కమోడిటీలకు కొరత ఎందుకు ఏర్పడుతోంది, దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడటం సరైనదేనా? దిగుమతులకు మనం తలుపులు మూసేయడం లేదు. కానీ మొత్తం ఉత్పత్తిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందా. ఇలాంటి అంశాలను మనం పునరాలోచించుకోవాలి’ అని మంత్రి చెప్పారు.

ఆదాయ అసమానతలు తగ్గించాలి ..
ఆదాయ అసమానతలను తగ్గించేలా ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఫినిష్డ్‌ ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవాలని పరిశ్రమకు నిర్మలా సీతారా>మన్‌ సూచించారు. వృద్ధికి ఊతమివ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో.. దేశీ పరిశ్రమ మరింతగా రిస్కులు తీసుకోవాలని, దేశానికి ఏం కావాలన్నది అర్థం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. కొన్ని కాలం చెల్లిన చట్టాలను తీసివేయడంతో ఆగటం కాకుండా .. పరిశ్రమకు ఎదురవుతున్న ఆటంకాలను తొలగించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. వ్యాపారాలపై నిబంధనల భారాన్ని తగ్గించే దిశగా ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవచ్చో పరిశీలించాలంటూ ప్రతి శాఖ, విభాగానికి ప్రధాని సూచించారని పేర్కొన్నారు.  

బ్యాంకింగ్‌ భేష్‌..
బ్యాంకింగ్‌ రంగం విశేష స్థాయిలో కోలుకుందని, రికవరీలు పెరిగే కొద్దీ మొండి బాకీలు క్రమంగా తగ్గడం మొదలైందని సీతారామన్‌ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్కెట్‌ నుంచి రూ. 10,000 కోట్లు సమీకరించాయని, ప్రభుత్వంపై ఆధారపడటం లేదని ఆమె పేర్కొన్నారు. ప్రత్యేక ప్రోగ్రాం కింద దీపావళితో ముగిసిన మూడు వారాల్లో నాలుగైదు వర్గాల వారికి బ్యాంకులు ఏకంగా రూ. 75,000 కోట్ల మేర రుణాలు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. వర్ధమాన దేశం అత్యం వేగంగా కోలుకోవడంతో పాటు రెండంకెల స్థాయికి దగ్గర్లో వృద్ధి రేటును అందుకోవడం సాధ్యమేనంటూ ప్రపంచానికి భారత్‌ చాటి చెప్పిందని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు