Taliban: 'తాలిబన్ల తల తిక్క నిర్ణయం'

5 Jan, 2022 19:30 IST|Sakshi

తాలిబన్ల తల తిక్క నిర్ణయాలు అక్కడి ప్రజలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే తాలిబన‍్ల అరచకాలకు బయపడి ప్రజలు దినదిన గండం నూరేళ్లే ఆయుష్షు అన్న చందంగా మారింది. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తూ వారు తీసుకునే నిర్ణయాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వం స్థానికంగా బట్టల షాపుల్లో ఉన్న ప్లాస్టిక్‌ మహిళల బొమ్మల తలల్ని తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  

గతేడాది ఆగస్ట్‌లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాలిబాన్లు ప్రజల స్వేచ్ఛని హరించి వేస్తున్నారు. మహిళలు, బాలికల స్వేచ్ఛకు భంగం కలిగేలా పరిపాలిస్తున్నారు. తాజాగా మహిళల ప్లాస‍్టిక్‌ బొమ్మలు ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని, పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న బట్టల షాపు యజమానులకు షాపుల్లో ఉండే మహిళ బొమ్మల తలలను నరికేయాలని ఆదేశించారు. ఇది (ఇస్లామిక్) షరియా చట్టానికి విరుద్ధం. కాబట్టి మహిళల ప్లాస్టిక్‌ బొమ్మల తలల్ని కత్తిరించాలని షాపుయజమానులకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రమోషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్ మంత్రిత్వ శాఖ అధిపతి అజీజ్ రెహ్మాన్ మీడియా సంస్థ ఏఎఫ్‌పీకి  చెప్పారు.

తాలిబన్లు తెచ్చిన కొత్త చట్టం అమల్లోకి రావడంతో కొంతమంది బట్టల షాపుల యజమానులు ప్లాస్టిక్‌ బొమ్మల తలల్ని కత్తిరించకుండా..స్కార్ఫ్‌లతో దాచే ప్రయత్నం చేశారు. దీనిపై అజీజ్‌ రెహ్మాన్‌ స్పందించారు."వారు (షాపుయ జమానులు) కేవలం బొమ్మల తలల్ని కవర్‌ చేయడమో, లేదంటే ఆ బొమ్మల్ని దాచిపెట్టడమో చేస్తే  అల్లా వారి షాపుల్లోకి లేదా ఇళ్లలోకి వెళ్లి వారిని ఆశీర్వదించడు." అని వ్యాఖ్యానించారు.  

1990లలో తాలిబన్లు తొలిసారి అధికారంలో ఉండగా రెండు పురాతన బుద్ధ విగ్రహాలను పేల్చిసి ప్రపంచ దేశాల ప్రతినిధుల ఎదుట ఆగ్రహానికి గురయ్యారు. మళ్లీ ఇప్పుడు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుండి అనేక ప్రావిన్సులలోని మాధ్యమిక పాఠశాలల నుండి బాలికలను నిషేధించారు. మహిళలు ఎక్కువగా ప్రభుత్వ రంగంలో పని చేయకుండా నిరోధించారు. ప్రభుత్వ పదవుల నుండి మినహాయించారు. గత వారం కాబూల్‌లోని అధికారులు ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే మహిళలకు కాకుండా వారి కుటుంబ సభ్యులైన పురుషులకు మాత్రమే ట్రాన్స్‌ పోర్ట్‌ అందించాలని ఆదేశించారు.

కాగా, ఇలా ప్రతి అంశంలో తాలిబాన్‌లు తమ మార్క్‌ పరిపాలన చేస్తుండగా..ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ నాశనం అయ్యింది. అమెరికా నుంచి రావాల్సిన బిలియన్ల డాలర్ల సంపద ఆగిపోయింది. మరి భవిష్యత్‌లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పరిపాలనలో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

చదవండి: అమెరికాను మేము ఓడించగలం అనడానికి ఇదే గుర్తు: తాలిబన్లు    

మరిన్ని వార్తలు