తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...?

18 Aug, 2021 11:12 IST|Sakshi

న్యూఢిల్లీ:  అఫ్టనిస్తాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల దృష్టి అప్ఘనిస్తాన్‌పై పడింది. తాలిబన్లు ఇప్పటికే లిథియం నిక్షేపాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తోన్నాయి. రానున్న రోజుల్లో తాలిబన్ల చేతిలో ఉన్న అఫ్ఘనిస్తాన్‌తో సంబంధాలు ఏవిధంగా ఉంటాయనే సందిగ్ధంలో అనేక దేశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే భారత్‌-అఫ్ఘనిస్తాన్‌ ద్వైపాక్షిక వాణిజ్యసంబంధాలపై పెను ప్రభావం చూపనుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) ఆందోళన వ్యక్తం చేసింది. అఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల హస్తగతం పలు వస్తువుల ధరలు ఆకాశానంటే అవకాశం ఉందని తెలుస్తోంది. (చదవండి: మొబైల్‌ రీచార్జ్‌ టారిఫ్‌ల పెంపు తప్పనిసరి కానుందా..!)

ఆకాశమే హద్దుగా పెరగనున్న ధరలు..!
అఫ్ఘనిస్తాన్‌ ఎండుద్రాక్ష, వాల్‌నట్స్, బాదం, అత్తి పండ్లు, పైన్ గింజలు, పిస్తా, ఎండిన ఆప్రికాట్,  నేరేడు పండు, చెర్రీ, పుచ్చకాయ, మరికొన్ని ఔషధ  మూలికలను భారత్‌కు ఎగుమతి చేస్తోంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌కు భారతదేశ ఎగుమతులలో టీ, కాఫీ, మిరియాలు, పత్తి, బొమ్మలు, పాదరక్షలు  ఇతర వినియోగించదగిన వస్తువులు ఉన్నాయని సీఎఐటీ జాతీయ అధ్యక్షుడు  బిసి భారతీయా తెలిపారు.

ఇండియా- అఫ్ఘనిస్తాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంలో భాగంగా 2020-21 సంవత్సరంలో 1.4 బిలియన్‌ డాలర్లు,  2019-20లో 1.52 బిలియన్‌ డాలర్ల వ్యాపారం ఇరు దేశాలు మధ్య కొనసాగుతుంది. అఫ్ఘనిస్తాన్‌కు భారత ఎగుమతుల విలువ 826 మిలియన్లు డాలర్లు  కాగా, దిగుమతులు 2020-21 సంవత్సరంలో 510 మిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ తరుణంలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యంపై అనిశ్చితి కారణంగా అఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువుల ధరలు భారతీయ మార్కెట్లలో పెరగవచ్చని సీఏఐటీ అగ్ర ప్రతినిధులు తెలిపారు. వాస్తవానికి తాలిబాన్లు అఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో దిగుమతి, ఎగుమతుల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. అంతేకాకుండా భారీ మొత్తంలో చెల్లింపులకు నిరోధం ఏర్పడుతుందని సీఏఐటీ వెల్లడించింది. పలు వ్యాపారులు ప్రమాదకర స్థితిలోకి వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. 


భారత ప్రభుత్వ మద్దతు తప్పనిసరి..!
ప్రస్తుత పరిస్థితిని గుర్తించి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వ్యాపారులకు కచ్చితంగా మద్దతును అందించాలని సీఏఐటీ పేర్కొంది. దేశంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉన్నందున ఆఫ్ఘనిస్తాన్‌తో ఒక నిర్దిష్ట కాలానికి వాణిజ్యం పూర్తిగా నిలిచిపోతుందని వారు అభిప్రాయపడ్డారు. అఫ్గనిస్తాన్‌కు ఎక్కువగా వాయుమార్గం ద్వారానే ఎగుమతి, దిగుమతులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అఫ్ఘనిస్తాన్‌ ఎయిర్‌స్పేస్‌పై పూర్తి గా నిషేధం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అఫ్ఘన్‌లో నెలకొన్న అనిశ్చితి తగ్గిన తరువాతనే ఇరు దేశాల దైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు ఓ కొలిక్కి వస్తాయని​ సీఏఐటీ వెల్లడించింది.

చదవండి: Wikipedia:హ్యాక్‌..! లిస్ట్‌లో టాప్‌ సెలబ్రిటీలు..!

మరిన్ని వార్తలు