ఘరానా మోసం : రైల్వే ఉద్యోగం..8 గంటల డ్యూటీ, వచ్చే పోయే రైళ్లను లెక్కించడమే పని!

20 Dec, 2022 16:54 IST|Sakshi

Railway Recruitment Scam: ప్రైవేట్‌ ఉద్యోగంలో ఆర్ధిక మాంద్యం భయాలు, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్‌ అవుదామంటే బోలెడంత కాంపిటీషన్. అయినా సరే కాలంతో పోటీ పడుతూ కోరుకున్న జాబ్‌ను దక్కించుకునేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఆ కోచింగ్‌, ఈ ఈవెంట్‌లు అంటూ ప్రాణాల్ని పణంగా పెడుతున్నారు. ఆ అవసరాన్నే క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. 

తమిళనాడుకు చెందిన 28 మంది యువకులకు రైల్వే శాఖలో ఉద్యోగం. ట్రావెల్‌ టికెట్‌ ఎగ్జామినర్‌(టీటీఈ), ట్రాఫిక్‌ అసిస్టెంట్‌, క్లర్క్‌ విభాగాల్లో జాబ్‌ డిజిగ్నేషన్‌ కోసం ఈ ఏడాది జూన్‌ - జులై నెలలో ట్రైనింగ్‌ కూడా తీసుకున్నారు. ఆ ట్రైనింగ్‌ ఏంటో తెలుసా? న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆయా ప్లాట్‌ఫామ్‌లలో నెలకు ఎన్ని ట్రైన్స్‌ వెళ్తున్నాయి. ఎన్ని రైళ్లు వస్తున్నాయో లెక్కపెట్టడమే. ఇందుకోసం ఆ యువకులు ఒక్కొక్కరు రూ.2లక్షల నుంచి రూ.24 లక్షల వరకు..మొత్తంగా రూ.2.67 కోట్లు చెల్లించారు. 

పాపం సుబ్బుసామి
తమిళనాడు విరుదునగర్ జిల్లాలోని ఓ కుగ్రామానికి చెందిన సుబ్బుసామి మాజీ సైనికుడు. మంచి వ్యక్తి.  తన ఊరిలో, లేదంటే తనకు తెలిసిన యువకులకు ఉపాధి కల్పించాలని నిత్యం ఆరాటపడుతుంటారు. ఈ తరుణంలో సుబ్బుసామి పనిమీద ఢిల్లీలోని ఎంపీ క్వార్టర్స్‌కు వెళ్లగా.. అక్కడ కోయంబత్తూరు నివాసి శివరామన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మాటల సందర్భంలో తనకు ఎంపీలు, మంత్రులతో సత్సంబంధాలు ఉన్నాయని, డబ్బులు చెల్లిస్తే నిరుద్యోగులకు రైల్వే ఉద్యోగం వచ్చేలా చేస్తానని శివరామన్‌.. సుబ్బుసామిని నమ్మించాడు. 

రూ.2.67 కోట్లు వసూలు
అతని మాటలు నమ్మిన సుబ్బుసామి ముగ్గురు నిరుద్యోగుల్ని శివరామన్‌కు ఫోన్‌లో పరిచయం చేయించాడు. ఉద్యోగం కావాలంటే ఢిల్లీకి రావాల్సిందేనని   ఆదేశించాడు. ఇలా ముగ్గురు నిరుద్యోగులు కాస్తా.. 25మంది అయ్యారు. దీంతో నిందితుడు తాను వేసిన మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా బాధితుల్ని ఢిల్లీకి రప్పించాడు. అక్కడ అభ్యర్ధులకు వికాస్ రాణా’తో మాట్లాడించాడు. ఉద్యోగం, ట్రైనింగ్‌, మెటీరియల్‌, ఆఫర్‌లెటర్‌, జాబ్‌ డిజిగ్నేషన్‌ ఏంటో క్లుప్తంగా వివరించిన రాణా.. వారి వద్ద నుంచి రూ.2.67 కోట్ల వరకు వసూలు చేశాడు. 

వచ్చే, పోయే రైళ్లను లెక్కేయడమే ఉద్యోగం
అనంతరం డబ్బులు తీసుకున్న కేటుగాళ్లు అభ్యర్ధులకు రైల్వే సెంట్రల్ హాస్పిటల్, కన్నాట్ ప్లేస్‌లో వైద్య పరీక్షల కోసం పిలిపించారు. ఆపై ఉత్తర రైల్వేలోని జూనియర్ ఇంజనీర్, శంకర్ మార్కెట్ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు. ఒక నెల ట్రైనింగ్‌ ఇచ్చారు. ఆ ట్రైనింగ్‌లో రోజుకి 8 గంటల పాటు ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో వచ్చే, పోయే రైళ్లు, రైళ్లకు ఉన్న భోగీలు లెక్కించారు.

ట్రైనింగ్ కూడా పూర్తయింది. 
ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న అనంతరం వికాస్‌ రాణా వారికి ఆఫర్‌ లెటర్లు అందించాడు. ఆ ఆఫర్‌ లెటర్‌లు తీసుకొని న్యూ ఢిల్లీ రైల్వే శాఖ అధికారుల్ని ఆశ్రయించడంతో ఈ ఘరనా మోసం వెలుగులోకి వచ్చింది. నిందితులు చేతుల్లో మోసపోయామని భావించిన అభ్యర్ధులు న్యాయం చేయాలని పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బుసామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక సుబ్బు సామి యువకుల్ని మోసం చేసిన కేటుగాళ్లపై చర్యలు తీసుకోవాలని, ఈ జాబ్‌ స్కామ్‌లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని తెలిపారు. 
 
వికాస్‌ రాణా పచ్చి మోసగాడు 
డబ్బు వసూలు కోసం వి​కాస్‌ రాణా ఎప్పుడూ తమను బయట కలుస్తుంటాడని, ఏ రైల్వే భవనంలోకి తీసుకెళ్లలేదని బాధితులు చెబుతున్నారు. శిక్షణకు సంబంధించిన ఆర్డర్లు, గుర్తింపు కార్డులు, శిక్షణ పూర్తయిన సర్టిఫికెట్లు, అపాయింట్‌మెంట్ లెటర్‌లు వంటి అన్ని పత్రాలను రైల్వే అధికారులతో క్రాస్ వెరిఫై చేయగా నకిలీవని తేలిందని రైల్వే పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు