యాడ్‌ తొలగించిన తనిష్క్‌.. వివరణ

13 Oct, 2020 21:20 IST|Sakshi
యాడ్‌లోని ఓ దృశ్యం

న్యూఢిల్లీ: ‘‘ఏకత్వం’’ పేరిట ప్రవేశపెట్టిన కొత్త కలెక‌్షన్‌ యాడ్‌కు సంబంధించిన వీడియోపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్‌ వెనక్కి తగ్గింది. యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ వీడియోను 24 గంటల్లోపే తొలగించింది. ముస్లిం కుటుంబంలో అడుగుపెట్టిన హిందూ కోడలి సీమంతం థీమ్‌తో రూపొందించిన ఈ ప్రకటన, లవ్‌ జీహాదీని ప్రోత్సహించేవిధంగా ఉందంటూ నెటిజన్లు  #BoycottTanishq ట్రెండ్‌ చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇకపై తనిష్క్‌ ఆభరణాలు కొనే ప్రసక్తే లేదని, టాటా గ్రూప్‌నకు సంబంధించిన అన్ని ఉత్పత్తులపై దీని ప్రభావం ఉంటుందంటూ ట్రోల్‌ చేసిన నేపథ్యంలో తమ ఉద్యోగులు, భాగస్వాముల శ్రేయస్సు కోరి యాడ్‌ను డిలీట్‌ చేసినట్లు సంస్థ వెల్లడించింది. (చదవండి: కేవలం ఆమె కోసమే; ‘తనిష్క్‌పై’ నెటిజన్ల ఫైర్‌..)

ఈ మేరకు తమ యాడ్‌ కారణంగా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నందుకు చింతిస్తున్నామని పేర్కొంటూ సంస్థ అధికార ప్రతినిధి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘సవాళ్లతో కూడిన ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భిన్న వర్గాల ప్రజలు, కుటుంబాలను ఒక్కచోట చేరుస్తూ, అందరూ కలిసి ఉంటే కలిగే ఆనందాన్ని సెలబ్రేట్‌ చేయడమే ఏకత్వం క్యాంపెయిన్‌ వెనుక ఉన్న అసలు ఉద్దేశం. కానీ ఇందుకు భిన్నంగా పూర్తి వ్యతిరేకమైన స్పందనలు వచ్చాయి, ఇందుకు మేం తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఎవరి మనోభావాలను కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు. దానితో పాటు మా ఉద్యోగులు, స్టోర్‌ సిబ్బంది, భాగస్వాములు అందరి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ యాడ్‌ను వెనక్కి తీసుకుంటున్నాం’’అని వివరణ ఇచ్చారు. 

కాగా తనిష్క్‌ యాడ్‌ తొలగించగానే మరికొంత మంది నెటిజన్లు.. ‘‘మతసామరస్యాన్ని పెంపొందించేలా ఉన్న ఈ యాడ్‌లో తప్పేమీ లేదు. అయినా దీనిని ఎందుకు తొలగించారో అర్థం కావడం లేదు’’అంటూ వాపోయారు.  రచయిత చేతన్‌ భగత్‌, కాంగ్రెస్‌ పార్టీ నేత సంజయ్‌ ఝా వంటి ప్రముఖులు సైతం ఈ యాడ్‌ను సమర్థిస్తూ టాటా గ్రూప్‌, తనిష్క్‌ మేనేజ్‌మెంట్‌కు అండగా నిలిచారు. కాగా ఈ యాడ్‌పై ట్రోలింగ్‌ కారణంగా టాటా ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడినట్లు బిజినెస్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

యాడ్‌లో ఏముంది?
ముస్లిం కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిన హిందూ మహిళకు సీమంతం చేసేందుకు అత్తింటి వాళ్లు సిద్ధపడతారు. దీంతో ఆశ్చర్యంలో మునిగిపోయిన కోడలు.. ‘‘ ఇలాంటి వేడుకలు మీ ఇంట్లో చేయరు కదా.. మరి ఇదేంటి?’’అని తన అత్తమ్మను అడుగుతుంది. ఇందుకు స్పందించిన ఆమె.. ‘‘కూతురిని సంతోషపెట్టేందుకు ప్రతి ఇంట్లోనూ ఇలాగే చేస్తారు. అంతే కదా’’అంటూ ప్రేమను చాటుకుంటుంది. అంతా కలిసి ఎంతో సంతోషంగా ఫంక్షన్‌లో పాల్గొంటారు. రెండు వేర్వేరు మతాలు, సంప్రదాయాలు, సంస్కృతుల అందమైన కలయిక అంటూ తనిష్క్‌ ఈ యాడ్‌ను రూపొందించింది.

>
మరిన్ని వార్తలు