ఫిషింగ్‌ కట్టడికి తాన్లా పరిష్కారం

4 Mar, 2023 03:06 IST|Sakshi

సైబర్‌ మోసాలకు ఇక చెక్‌

వీఐ నెట్‌వర్క్‌లో పరీక్షలు

కంపెనీ ఫౌండర్‌ ఉదయ్‌ రెడ్డి

బార్సిలోనా: ఈ–మెయిల్స్, మొబైల్‌కు సైబర్‌ నేరగాళ్లు పంపే లింక్స్‌ను ఓపెన్‌ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్న ఘటనలు రోజూ చూస్తున్నాం. ఇలాంటి ఫిషింగ్‌ సందేశాలు సబ్‌స్క్రైబర్లకు చేరకుండా నిరోధించే టెక్నాలజీని క్లౌడ్‌ కమ్యూనికేషన్స్‌ సేవల్లో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియా నెట్‌వర్క్‌లో పరీక్షలు జరుగుతున్నాయి. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌–2023 సందర్భంగా ఈ సాంకేతికతను ట్రాయ్‌ చైర్మన్‌ పి.డి.వాఘేలా చేతుల మీదుగా ఆవిష్కరించారు.

‘యాంటీ–ఫిషింగ్‌కు పరిష్కారాన్ని భారత్‌లో అభివృద్ధి చేశాం. సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. తాన్లా యాంటీ–ఫిషింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఒక నిమిషంలో మోసాన్ని గుర్తిస్తుంది. ఈ సాంకేతికత కోసం అంతర్జాతీయంగా ఆసక్తి కనబరుస్తున్నారు’ అని తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ ఫౌండర్, చైర్మన్, సీఈవో డి.ఉదయ్‌ రెడ్డి తెలిపారు. మోసగాళ్లను ఏరివేయడానికి నియంత్రణ సంస్థలకు ఇది సాయపడుతుందని అన్నారు. వాయిస్‌ కాల్‌ ఆధారిత మోసాలకు చెక్‌ పెట్టేందుకు సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. దీనిని వచ్చే రెండు త్రైమాసికాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు.   

30 కోట్ల మందికి ముప్పు..
భారత్‌లో కంపెనీ అంచనాల ప్రకారం దాదాపు 30 కోట్ల మంది ఫిషింగ్‌ దాడులకు గురయ్యే అవకాశం ఉందని ఉదయ్‌ రెడ్డి వెల్లడించారు. ‘వీరిలో 5 లక్షల మంది మోసపోయే చాన్స్‌ ఉంది. బాధితుల్లో 7% మంది మాత్రమే వివిధ కారణాల వల్ల నేరం గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఫేక్‌ ఎలక్ట్రిసిటీ బిల్‌ అలర్ట్, నో యువర్‌ కస్టమర్‌ వెరిఫికేషన్‌ వంటి 10–11 పద్ధతుల్లో ఫిషింగ్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సిమ్, యాప్స్‌ను మోసగాళ్లు వేదికగా చేసుకుంటున్నారు. స్కామ్‌ సందేశాలు వినియోగదారులకు చేరకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఈ టెక్నాలజీని మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లతో మాత్రమే కాకుండా గూగుల్, వాట్సాప్‌ వంటి ప్లాట్‌ఫామ్స్‌తో కూడా అనుసంధానించాం. ఫిషింగ్‌ సైట్స్‌ను నిరోధించే కొన్ని  సర్వీస్‌ ఏజెన్సీలతో కూడా భాగస్వామ్యం చేసుకున్నాం’ అని వివరించారు. 

మరిన్ని వార్తలు