మైక్రోసాఫ్ట్‌తో తాన్లా జట్టు

21 Jan, 2021 03:59 IST|Sakshi

వైజ్‌లీ ప్లాట్‌ఫాం ఆవిష్కరణ

రోజుకు 100 కోట్ల దాకా మెసేజీల ప్రాసెసింగ్‌

ప్రైవసీ, భద్రతకు పెద్దపీట

తాన్లా చైర్మన్‌ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫామ్స్‌ సేవలందించే తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ తాజాగా బ్లాక్‌చెయిన్‌ సాంకేతికత ఆధారిత వైజ్‌లీ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. ఇది రోజుకు 100 కోట్ల దాకా మెసేజీలను సురక్షితంగా, వేగవంతంగా ప్రాసెస్‌ చేయగలదని బుధవారం వైజ్‌లీ ఆవిష్కరించిన సందర్భంగా తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ చైర్మన్, సీఈవో డి. ఉదయ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో కలిసి దీన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఇది కంపెనీలు, మొబైల్‌ క్యారియర్స్, ఓటీటీ సంస్థలు, మార్కెటర్లు, పరిశ్రమ నియంత్రణ సంస్థలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.

బీమా, బ్యాంకింగ్‌ తదితర రంగాల సంస్థలు తమ కస్టమర్లకు పంపే మెసేజీలు, ఓటీపీలు, మెయిల్స్‌ మొదలైనవి డెలివరీ అయ్యే క్రమంలో వివిధ ప్రక్రియల కారణంగా జాప్యం జరగడం, పూర్తి స్థాయిలో ఎన్‌క్రిప్షన్‌ లేకపోవడం వంటి సవాళ్లు ఉంటున్నాయని ఉదయ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్‌క్రిప్షన్, డేటా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, ప్రారంభం నుంచి చివరి దాకా గోప్యత దెబ్బతినకుండా చూసేందుకు వైజ్‌లీ తోడ్పడగలదని ఆయన వివరించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ సంబంధిత సాంకేతికతలతో కంపెనీలు సర్వీసుల నాణ్యతను పెంచుకోవడానికి, వ్యయాలను తగ్గించుకోవడానికి ఉపయోగపడగలదని పేర్కొన్నారు. క్రిప్టోగ్రఫీ, బ్లాక్‌చెయిన్‌ ప్రాసెస్‌లకు సంబంధించి వైజ్‌లీ ఇప్పటికే మూడు పేటెంట్లు దక్కించుకుందని ఉదయ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. డేటాకు ప్రైవసీ, భద్రత అత్యంత కీలకమైనవని, వీటికి వైజ్‌లీ తోడ్పడుతుందని మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి ఈ సందర్భంగా తెలిపారు.  

వైజ్‌లీలో మార్కెట్‌ ప్లేస్‌ విధానం ..
ఇప్పటికే ట్రూబ్లాక్‌ ప్లాట్‌ఫాం ద్వారా దేశీయంగా వివిధ సంస్థలకు ఈ తరహా సర్వీసులు అందిస్తున్నామని ఉదయ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. ఇప్పుడిక వైజ్‌లీతో ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు అందించనున్నామని ఆయన వివరించారు. దీనిలో ప్రప్రథమంగా మార్కెట్‌ప్లేస్‌ విధానాన్ని కూడా పొందుపర్చామని పేర్కొన్నారు. టెలికం సంస్థలు తదితర సర్వీస్‌ ప్రొవైడర్లను తమ అవసరాలకు అనుగుణంగా కంపెనీలు పారదర్శకంగా ఎంపిక చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన చెప్పారు. కమ్యూనికేషన్స్‌ ప్లాట్‌ఫాం యాజ్‌ ఏ సర్వీస్‌ (సీపాస్‌) విభాగంలో ఇలాంటిది అందించడం ప్రపంచంలోనే ఇదే ప్రథమమని ఉదయ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. క్లౌడ్‌ ద్వారా వైజ్‌లీ ప్లాట్‌ఫాంను అందించడానికి మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం తోడ్పడుతుందని ఆయన చెప్పారు. అలాగే మైక్రోసాఫ్ట్‌ అనుభవం .. దీని రూపకల్పనలో ఉపయోగపడిందని వివరించారు. ఇక, వైజ్‌లీ విక్రయంలో రెండు సంస్థలు కలిసి పనిచేసేందుకు కూడా భాగస్వామ్యం తోడ్పడగలదన్నారు.

40 బిలియన్‌ డాలర్లకు గ్లోబల్‌ సీపాస్‌ ...
ప్రస్తుతం అంతర్జాతీయంగా సీపాస్‌ వ్యాపార విభాగం సుమారు 20 బిలియన్‌ డాలర్లుగా ఉందని ఉదయ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు. గార్ట్‌నర్‌ అంచనాల ప్రకారం వచ్చే మూడేళ్లలో ఇది రెట్టింపై 40 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చని పేర్కొన్నారు. ఇక భారత మార్కెట్‌ విషయానికొస్తే 1 బిలియన్‌ డాలర్లకు పైగా ఉంటుందన్నారు. పలు దిగ్గజ సంస్థలతో పాటు ప్రభుత్వానికి కూడా సర్వీసులు అందిస్తూ దేశీయంగా తాము ఈ రంగంలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. కరోనా వైరస్‌ పరిణామాల తర్వాత డిజిటైజేషన్‌ మరింత వేగవంతమైందన్నారు. రాబోయే రోజుల్లో ఇది గణనీయంగా పుంజుకుంటుందని, తద్వారా అవకాశాలు మరింత పెరగగలవని ఉదయ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తలు