Sanjeev Kaul Success Story: ఆయనంతే.. ఈ దేశమంటే అమితమైన ప్రేమ! కావాలంటే చూడండి..

17 Jun, 2022 12:53 IST|Sakshi

ఆ పారిశ్రామికవేత్త గురించి అంతా గొప్పగా చెబుతారు. ఈ దేశ ప్రజల మట్టిపై ఆయనకు మమకారం ఉందంటారు. సామాన్యుల జీవితంలో మంచి మార్పుకోసం పరితపిస్తాడు అనేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇలాంటిదే మరో ఉదాహరణను ఓ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్టు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. తన జీవితంలో చోటు చేసుకున్న ఘటన సోదాహారంగా వివరించారు. అదేంటో ఓ సారి చూద్దాం.

సమయం మించిపోతుండటంతో హడావుడిగా విమానం ఎక్కాను. నేరుగా నా సీటులో కూర్చుని ల్యాప్‌ట్యాప్‌ ఓపెన్‌ చేశాను. ఫ్లైట్‌ దిగగానే చర్చించాల్సిన విషయాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో చెక్‌ చేసుకుంటున్నాను. క్రితం రోజు జరిగిన సమావేశంలో ఎందుకు నా ప్రజెంటేషన్‌ లక్ష్యాన్ని చేరుకోలేదనే విషయాన్ని విశ్లేషిస్తున్నాను. ఇంతలో నా పక్క సీటులో ఎవరో పెద్దాయన వచ్చి కూర్చుకున్నారు. అంత పెద్దాయన్ని చూసి ఒక్క క్షణం మాటలు రాలేదు. కానీ నా పని ఒత్తిడిలో పడి  ఆయన్ని పెద్దగా పట్టించుకోకుండా ల్యాప్‌ట్యాప్‌కే అంకితం అయ్యాను. ఆ తర్వాత విమానం టేకాఫ్‌ తీసుకుంది.

గాలిలో మేడలా
గాలిలో విమానం ఉన్నట్టే నా పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ అందులో ఉన్న ప్రాజెక్టు భవిష్యత్తు కూడా గాలిలో దీపంలా మారిందనే ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంతలో భోజనం వచ్చింది. హడావుడిగా తినేశాను. ఆరెంజ్‌ జ్యూస్‌ తాగుతుంటే నా చేయి తగిలి గ్లాసు ఒలికింది. నా టై, షర్ట్‌పై జ్యూస్‌ పడింది. నేను సర్థుకునేలోగా ఆ పెద్ద మనిషి చొరవ తీసుకున్నారు. నా షర్ట్‌పై పడిన జ్యూ మరకలు తన కర్చీఫ్‌తో తుడిచారు. అలా ఆయనతో మాటలు కలిశాయి.

వాళ్లు ఇక్కడ ఉండరు
‘ఫ్లైట్‌ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను’ మీరు ఏదో ఆందోళనగా ఉన్నారు? ఇబ్బంది లేకుంటే చెప్పండి అంటూ ప్రశ్నించాడా పెద్దాయన. ఆ ఒక్క మాటతో అప్పటి వరకు ఆపుకుంటూ వస్తున్న కన్నీళ్లు నా ప్రమేయం లేకుండానే కనుకొనల నుంచి జారిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కష్టంగా బాధను అణచుకుంటూ ఆయనకు చెప్పాను ‘విదేశాల్లో భవిష్యత్తు వెతకాలని అనుకుంటున్న ఇద్దరు సైంటిస్టులను ఇండియాకు రప్పించాను. వాళ్లతో ఓ ప్రాజెక్టు దేశంలో పెట్టాలని ప్లాన్‌ చేశాను. కానీ ఎంత మందికి చెప్పినా ఫండింగ్‌ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకే ఒక్క అవకాశం ఉంది. అది కూడా విఫలమైతే వాళ్లు మళ్లీ దేశం విడిచి వెళ్లడం ఖాయం’ అంటూ చెప్పాను.

వచ్చి కలవండి
నేను చెబుతున్నది శ్రద్దగా విన్న ఆ పెద్దాయన నా ఫోన్‌ నంబర్‌ అడిగి తీసుకున్నారు. తన కంపెనీ తరఫున మా వాళ్లు మీతో టచ్‌లోకి వస్తారంటూ చెప్పారు. ప్లైట్‌ ల్యాండయ్యాక ఎవరి దోవన వాళ్లం పోయాం. అంత బిజీగా ఉండే పెద్దాయన నా విషయం ఎక్కడ పట్టించుకుంటాడనే భావన నాలో పేరుకుపోయింది. కానీ నా అంచనా తప్పయ్యింది. ఈ పెద్ద మనిషి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మరుసటి రోజు కాల్‌ వచ్చింది. ఇద్దరు సైంటిస్టులతో వచ్చి కలవమని. మా ప్రాజెక్టు గురించి ప్రజంటేషన్‌ ఇవ్వమని వాళ్లు చెప్పారు.

ఇండియాలోనే మొదటిసారి
ఫోన్‌ రావడం ఆలస్యం ఇద్దర సైంటిస్టులను తీసుకుని ఆ పెద్దాయన చెప్పిన అడ్రస్‌కి వెళ్లాను. మా ప్రాజెక్టు గురించి వివరించాను. వెంటనే వాళ్లు ఫండింగ్‌కి ముందుకు వచ్చారు. అలా కాసిముక్తియార్‌, రశ్మీ బర్‌బైధ్యల ఆధ్వర్యంలో అడ్వినస్‌ ఫార్మా కంపెనీ ప్రాణం పోసుకుంది. ఆ తర్వాత కాలంలో మన దేశ సైంటిస్టులే కాకుండా విదేశాలకు చెందిన యాభై మంది సైంటిస్టులు తమ మేథస్సును ఈ ప్రాజెక్టు కోసం ధారపోశారు. అలా ఇండియాలో ఎండ్‌ టూ ఎండ్‌ సర్వీసులు అందించే తొలి ఫార్మా ప్రాజెక్టు నిలదొక్కుకుని దేశానికి గర్వకారణంగా మారింది. 


ఆయన ఎవరంటే
ఇంతకీ నా పేరు చెప్పనేలేదు. నేను క్రిస్‌క్యాపిటల్‌కి చెందని సంజీవ్‌ కౌల్‌. ఈ ఘటన 2004లో జరిగింది. నాకు సాయం చేసిన పెద్ద మనిషి మరెవరో కాదు ది గ్రేట్‌ రతన్‌టాటా. అవకాశాలు లేక ఈ దేశం నుంచి విదేశాలకు వెళ్తున్న యువతరాన్ని మేథో వలసను ఆపేందుకు నేను పడ్డ తపన ఆయన అర్థం చేసుకున్నారు. మేథో వలసను అడ్డుకోవడమే కాదు ఇతర దేశాలకు చెందిన సైంటిస్టులు కూడా ఇండియా కోసం పని చేసేలా చేశారు. ఈ మొత్తం వ్యవహారం జరగడానికి కారణం ఒక చిన్న ప్రయాణం. అందులో నా ఆవేదన, తపనను అర్థం చేసుకుని దేశ భవిష్యత్తు గురించి కలలు కనే రతన్‌ టాటా లాంటి వ్యక్తి పరిచయం.

చదవండి: మీకెందుకయ్యా కార్లు అన్న ‘ఫోర్డ్‌’.. ఇండియా సత్తా చూపిన రతన్‌టాటా

మరిన్ని వార్తలు