టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌లో టాటా కాఫీ విలీనం!

30 Mar, 2022 11:12 IST|Sakshi

న్యూఢిల్లీ: పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా టాటా కాఫీ (టీసీఎల్‌) వ్యాపార కార్యకలాపాలాన్నింటినీ విలీనం చేసుకుంటున్నట్లు టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ (టీసీపీఎల్‌) తెలిపింది. టీసీఎల్‌కు చెందిన ప్లాంటేషన్‌ వ్యాపారాన్ని టీసీపీఎల్‌ బెవరేజెస్‌ అండ్‌ ఫుడ్స్‌ (టీబీఎఫ్‌ఎల్‌) కింద విడగొట్టనుండగా.. మిగతా వ్యాపారాలు (బ్రాండెడ్‌ కాఫీ మొదలైనవి) టీసీపీఎల్‌లో విలీనమవుతాయని పేర్కొంది. 

ముందుగా విభజన, ఆ తర్వాత విలీనం ఉంటాయని సంస్థ వివరించింది. విలీనానికి సంబంధించిన స్కీము కింద ప్రతి 55 టీసీఎల్‌ షేర్లకు గాను 14 టీసీపీఎల్‌ షేర్లు లభిస్తాయి. విభజన, విలీన ప్రతిపాదనలకు రెండు సంస్థల బోర్డులు మంగళవారం ఆమోదముద్ర వేశాయి.  

గతేడాది డిసెంబర్‌ ఆఖరు నాటికి టీసీఎల్‌లో టీసీపీఎల్‌కు 57.48 శాతం వాటాలు ఉండగా.. విలీన డీల్‌ పూర్తయితే 100 శాతం వాటాలు దక్కించుకున్నట్లవుతుంది. మరోవైపు, షేర్ల మార్పిడి ద్వారా తమ బ్రిటన్‌ అనుబంధ సంస్థ టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ యూకే లిమిటెడ్‌లో మైనారిటి వాటాలను కొనుగోలు చేయనున్నట్లు టీసీపీఎల్‌ తెలిపింది. ఈ ప్రతిపాదనలతో వాటాదారులకు మరింత విలువ చేకూర్చగలమని టీసీపీఎల్‌ ఎండీ సునీల్‌ డిసౌజా చెప్పారు. 

టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌లో టాటా కెమికల్స్‌కు సంబంధించిన కన్జూమర్‌ ఉత్పత్తుల వ్యాపారం విలీనంతో టీసీపీఎల్‌ ఏర్పడింది. టాటా సాల్ట్, టాటా టీ, టెట్లీ, టాటా గ్లూకో ప్లస్‌ మొదలైన బ్రాండ్లు సంస్థ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. కంపెనీకి దేశ విదేశీ మార్కెట్లలో దాదాపు రూ. 11,600 కోట్లపైగా వార్షిక టర్నోవరు ఉంది.    


 

మరిన్ని వార్తలు