రాత్రికి రాత్రే ఐటీ ఉద్యోగాలు ఊడుతున్న వేళ..టీసీఎస్‌ గుడ్‌న్యూస్‌!

19 Feb, 2023 17:52 IST|Sakshi

ఆర్ధిక మాద్యం ముంచుకొస్తుందన్న భయాలతో ప్రపంచ వ్యాప్తంగా సంస్థల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో టీసీఎస్‌ సైతం ఉద్యోగుల్ని ఇంటికి సాగంపుతుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికల్ని టీసీఎస్‌ ఖండించింది. సంస్థలో చేరిన ఉద్యోగి ప్రతిభను తీర్చిదిద్దుతామే తప్పా.. ఉద్యోగుల్ని తొలగించడం లేదని స్పష్టం చేసింది. 

ఇటీవల టీసీఎస్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌ మిలింద్ ల‌క్క‌డ్ పీటీఐకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్‌ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయనే అంశం చర్చకు వచ్చింది. 

ఇక, అట్రిషన్‌ రేటుతో పాటు ఉద్యోగుల తొలగింపులు ఉంటాయా? అన్న ప్రశ్నకు సమాధానంగా మిలింద్‌ మాట్లాడుతూ.. స్టార్టప్స్‌లో జాబ్‌ కోల్పోయిన ఉద్యోగుల్ని టీసీఎస్‌ నియమించుకునే ప్రణాళికల్లో ఉందని వ్యాఖ్యానించారు. సంస్థలోని ఉద్యోగుల ప్రతిభను మాత్రమే  తీర్చిదిద్దుతామే తప్పా.. ఉద్యోగుల్ని తొలగించమని అన్నారు.      

ఆయా సంస్థలు అవసరానికి మించి ఉద్యోగుల్ని నియమించుకున్నాయి. అనిశ్చితి నేపథ్యంలో వారిని తొలగిస్తున్నాయి. కానీ టీసీఎస్‌ ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది. తమ సంస్థలో ఒక్కసారి చేరితే ఉద్యోగుల నుంచి ప్రొడక్టివిటీ, ఉత్పత్తుల తయారీ గురించి మాత్రమే ఆలోచిస్తుందని, లేఆఫ్స్‌పై కాదని పేర్కొన్నారు.   

ఒకవేళ సంస్థ ఊహించని దానికంటే నైపుణ్యం తక్కువైతే ఉద్యోగికి ట్రైనింగ్‌ ఇస్తామని.. అవసరం అయితే ఎక్కువ సార్లు ట్రైనింగ్‌ ఇచ్చేందుకు ప్రాధన్యత ఇస్తామన్నారు. ప్రస్తుతం టీసీఎస్‌లో మొత్తం 6 లక్షల మంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిఏడు ఉద్యోగులకు శాలరీలు ఎలా పెంచుతామో.. ఈ ఏడాది సైతం అలాగే పెంచుతామని మిలింద్‌ సూచించారు.

అనేక స్టార్టప్‌లు ఉద్యోగుల్ని తొలగిస్తున్నందున.. ఎడ్యుకేషన్, టెక్నాలజీ వంటి రంగాలలో  పింక్‌ స్లిప్‌లు తీసుకున్న ఉద్యోగుల్ని టీసీఎస్‌ నియమించుకోవాలని చూస్తున్నట్లు మిలింద్‌ చెప్పారు. దీంతో పాటు  యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్‌, ప్రొడక్ట్ ఎక్స్‌పీరియన్స్‌ విభాగాల్లో  ప్రతిభ కోసం నిపుణులైన ఉద్యోగుల కోసం అన్వేషిస్తున్నట్లు టీసీఎస్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌ మిలింద్ ల‌క్క‌డ్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు