2022-23 క్యూ1 ఫలితాలు: టాటా కన్జూమర్‌ లాభం, ఎంతంటే?

12 Aug, 2022 09:20 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్‌ రంగ దిగ్గజం టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 38 శాతం జంప్‌చేసి రూ. 277 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 200 కోట్లు మాత్రమే ఆర్జించింది.

 వ్యయ నియంత్రణలు, ధరల పెంపు లాభాలు పుంజుకునేందుకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం 11 శాతం ఎగసి రూ. 3,327 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 3,008 కోట్ల టర్నోవర్‌ ప్రకటించింది. 

ఆదాయంలో దేశీ వాటా 9 శాతం వృద్ధితో రూ. 2,145 కోట్లను తాకగా.. అంతర్జాతీయ బిజినెస్‌ సైతం 9 శాతం పుంజుకుని రూ. 837 కోట్లకు చేరింది. నాన్‌బ్రాండెడ్‌ బిజినెస్‌ రూ. 278 కోట్ల నుంచి రూ. 352 కోట్లకు బలపడింది. ఈ ఫలితాల నేపథ్యంలో టాటా కన్జూమర్‌షేరు బీఎస్‌ఈలో 0.25 శాతం లాభపడి రూ. 790 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు