టాటా కన్జూమర్‌ టర్న్‌అరౌండ్‌

7 May, 2021 05:36 IST|Sakshi

క్యూ4లో రూ. 74 కోట్ల నికర లాభం

షేరుకి రూ. 4 చొప్పున తుది డివిడెండ్‌

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ కంపెనీ..టాటా కన్జూమర్‌ నాలుగో త్రైమాసికంలో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నష్టాల నుంచి బయటపడి రూ. 74 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 122 కోట్ల నికర నష్టం నమోదైంది. దేశీయంగా అమ్మకాల పరిమాణం రెండంకెల వృద్ధిని సాధించడం ప్రభావం చూపింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 26 శాతం ఎగసి రూ. 3,037 కోట్లను అధిగమించింది.

వాటాదారులకు షేరుకి రూ. 4.05 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. క్యూ4లో దేశీ ఆహారం, పానీయాల విభాగాలలో 20 శాతంపైగా పురోగతిని అందుకున్నట్లు టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ గ్రూప్‌ సీఎఫ్‌వో ఎల్‌.కృష్ణకుమార్‌ పేర్కొన్నారు. నాన్‌బ్రాండెడ్‌ బిజినెస్‌ టాటా కాఫీ ప్లాంటేషన్‌ సైతం పటిష్ట పనితీరు చూపడం ఇందుకు సహకరించినట్లు తెలియజేశారు. టాటా కన్జూమర్‌ గతంలో టాటా బెవరేజెస్‌గా కార్యకలాపాలు సాగించిన సంగతి తెలిసిందే. కాగా.. క్యూ4లో మొత్తం వ్యయాలు 29 శాతం పెరిగి రూ. 2,818 కోట్లను తాకాయి.

విభాగాల వారీగా
దేశీయంగా పానీయాల విభాగం 60 శాతం జంప్‌చేసి రూ. 1,205 కోట్లను తాకగా.. ఫుడ్‌ బిజినెస్‌ 22 శాతం పుంజుకుని రూ. 642 కోట్లకు చేరింది. వీటిలో సాల్ట్‌ అమ్మకాలు 17 శాతం, సంపన్‌ విభాగం ఆదాయం 26 శాతం చొప్పున ఎగసింది. అయితే అంతర్జాతీయ పానీయాల బిజినెస్‌ యథాతథంగా రూ. 875 కోట్లుగా నమోదైంది. టాటా స్టార్‌బక్స్‌ ఆదాయం 14 శాతం బలపడింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి టాటా కన్జూమర్‌ నికర లాభం రెట్టింపై రూ. 930 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం 20 శాతం వృద్ధితో రూ. 11,602 కోట్లకు చేరింది.
 టాటా కన్జూమర్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో స్వల్పంగా 0.3 శాతం బలపడి రూ. 651 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 655–638 మధ్య ఊగిసలాడింది.

మరిన్ని వార్తలు