ఎయిర్ ఇండియాకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

7 Feb, 2022 18:05 IST|Sakshi

దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కొద్ది రోజుల క్రితం తన సొంత గూటి(టాటా)కి చేరిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే, ఎయిర్ ఇండియాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలియజేస్తూ టాటా గ్రూప్ ఒక ఆసక్తికర ట్వీట్ చేసింది. సుమారు 75 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఎయిర్ ఇండియాకు ఆ పేరు పెట్టడం వెనుక జరిగిన ఆసక్తికర ప్రక్రియను తన ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ఆ పేరు పెట్టడానికి అప్పటి టాటా సంస్థ ఉద్యోగులు యాజమాన్యానికి ఎలా సహకరించారో సంస్థ వివరించింది.

1946లో టాటా సన్స్ విభాగం నుంచి టాటా ఎయిర్ లైన్స్ ఒక సంస్థగా విస్తరించినప్పుడు, సంస్థ దానికి ఒక పేరు పెట్టవలసి వచ్చింది. భారతదేశం మొదటి విమానయాన సంస్థకు సంస్థ 4 పేర్లను(ఇండియన్ ఎయిర్లైన్స్, పాన్-ఇండియన్ ఎయిర్లైన్స్, ట్రాన్స్-ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్-ఇండియా)లను ఎంపిక చేసింది. ఆ నాలుగు పేర్లలో ఒక పేరును ఎంపిక చేసేందుకు ప్రజాస్వామ్య బద్దంగా బాంబే హౌస్‌లోని టాటా ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఉద్యోగులు తమ మొదటి, రెండవ ప్రాధాన్యతలను సూచించమని సంస్థ వారిని కోరింది.

మొదటి ఓటింగులో ఎయిర్-ఇండియాకు 64 ఓట్లు, ఇండియన్ ఎయిర్ లైన్స్'కు - 51 ఓట్లు, ట్రాన్స్-ఇండియన్ ఎయిర్ లైన్స్ కు -28 ఓట్లు, పాన్-ఇండియన్ ఎయిర్ లైన్స్ కు - 19 ఓట్లు వచ్చాయి. ఇందులో అధిక ఓట్లు వచ్చిన మొదటి రెండు పేర్లను ఎంపిక చేసి మరలా ఓటింగు ప్రక్రియను చేపట్టింది. అయితే, రెండవసారి ఓటింగులో ఎయిర్-ఇండియాకు 72 ఓట్లు, ఇండియన్ ఎయిర్ లైన్స్ కు 58 ఓట్లు వచ్చాయి. దీంతో తమ తమ నూతన విమానయాన సంస్థకు 'ఎయిర్-ఇండియా' అని పేరు పెట్టినట్లు ఆ ట్వీట్లో సంస్థ పేర్కొంది.

(చదవండి: జియోబుక్ ల్యాప్‌టాప్‌ గురించి అదిరిపోయే అప్‌డేట్‌..!)

మరిన్ని వార్తలు