45వేల ఉద్యోగులు కావాలి.. అంతా మహిళలే.. ఎక్కడంటే!

1 Nov, 2022 15:57 IST|Sakshi

భారత్‌లో ఐఫోన్ తయారీని పెంచేందుకు టాటా గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం తమిళనాడులోని తన ప్లాంట్‌లో వేలాది సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. అక్కడి ప్లాంట్లో ఐఫోన్ విడిభాగాల తయారీని చేపడుతున్న సంగతి తెలిసిందే. కోవిడ్‌ లాక్‌డౌన్‌లు, అమెరికాతో రాజకీయ ఉద్రిక్తతల నడుమ యాపిల్ తన తయారీ స్థావరాన్ని చైనా నుంచి తరలించాలని చూస్తోంది.

ఈ అంశం భారత్‌కు కలిసొచ్చే అంశంగా మారింది. ప్రస్తుతం భారత్‌లో తన కార్యకలాపాలను పెంచాలని యాపిల్‌ భావిస్తోంది.బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం.. తమిళనాడులో హోసూర్‌లోని ప్లాంట్‌లో పనిచేసేందుకు వచ్చే 18 నుంచి 24 నెలల్లో 45 వేల మంది ఉద్యోగులను టాటా గ్రూప్ నియమించుకోనుంది. వారందరూ కూడా మహిళా ఉద్యోగులేనని తెలుస్తోంది.

కాగా ఫ్యాక్టరీలో ఇప్పటికే 10,000 మంది కార్మికులు పనిచేస్తుండగా, వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. ఈ ప్లాంట్‌ 500 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. గత సెప్టెంబర్‌లో దాదాపు 5,000 మంది మహిళలను నియమించుకున్నారు.

అయితే టాటా, ఆపిల్ సంస్థలు హోసూర్‌లో ఈ నియామకాల గురించి పూర్తి సమాచారం తెలపాల్సి ఉంది. దేశంలో ఐఫోన్‌లను అసెంబుల్ చేసేందుకు ఎలక్ట్రానిక్స్ తయారీ జాయింట్ వెంచర్‌ను స్థాపించడానికి టాటా గ్రూప్ విస్ట్రాన్‌తో చర్చలు కూడా జరుపుతోంది.

చదవండి: సామాన్యులకు శుభవార్త.. తగ్గిన పెట్రోల్, డీజిల్‌ ధరలు

మరిన్ని వార్తలు