-

5జీ కన్జ్యూమర్‌ సేవల్లోకి రావడం లేదు

13 Oct, 2022 05:47 IST|Sakshi

ఇందుకు సంబంధించి ప్రణాళికేదీ లేదు

టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌

ముంబై: టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ కీలక ప్రకటన చేశారు. వినియోగదారులకు 5జీ సేవలను అందించే ప్రణాళిక ఏదీ తమ వద్ద లేదని స్పష్టం చేశారు. భారీ నష్టాల కారణంగా కన్జ్యూమర్‌ టెలికం సేవల నుంచి కొన్నేళ్ల క్రితమే టాటా గ్రూపు తప్పుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాకపోతే 4జీ, 5జీకి సంబంధించి అధునాత టెక్నాలజీ సదుపాయాలను నిర్మించడంపైనే తమ ప్రయత్నాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయని, 6జీపైనా పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పారు. ‘లోక్‌మత్‌ మహరాష్ట్రియన్‌ ఆఫ్‌ ఇయర్‌ 2022’ అవార్డుల కార్యక్రమం సందర్భంగా చంద్రశేఖరన్‌ మాట్లాడారు.

టాటా గ్రూపు కంపెనీలు నిర్మిస్తున్న టెక్నాలజీ సదుపాయాలు పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసినవని, పరీక్షించిన అనంతరం పెద్ద ఎత్తున విస్తరించనున్నట్టు చెప్పారు. వీటికి సంబంధించి ఇప్పటికే విచారణలు వస్తున్నట్టు తెలిపారు. గ్రూపులోని నాలుగు ఎయిర్‌లైన్స్‌ కంపెనీలను స్థిరీకరించే ప్రణాళికలపై మాట్లాడుతూ.. ఒక్కటే ఎయిర్‌లైన్, రెండు ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ‘‘ఒకటి పూర్తిస్థాయి సేవలతో ప్రపంచ స్థాయి కంపెనీగా ఉంటుంది.

అప్పుడు భారతీయులు ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు వీలుటుంది. రెండోది తక్కువ వ్యయాలతో కూడి ఉంటుంది. ఇది మా లక్ష్యం. ఇది సుదీర్ఘ ప్రయాణం’’ అని పేర్కొన్నారు. రూపాయి అన్ని ఇతర కరెన్సీలతో లాభపడుతూ, డాలర్‌తో విలువను కోల్పోతున్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని మనం నియంత్రించగలమన్నారు. టాటా గ్రూపు, ఇతర పారిశ్రామిక గ్రూపులు ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇతర అధునాతన రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్నట్టు చంద్రశేఖరన్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు