కరోనా టెస్ట్  : 90 నిమిషాల్లోనే ఫలితం

9 Nov, 2020 16:18 IST|Sakshi

కోవిడ్‌-19ను గుర్తించేందుకు టాటా టెస్ట్‌ కిట్‌

90నిమిషాల్లోనే ఫలితం

సాక్షి,ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ముప్పు భయపెడుతున్నతరుణంలో ఈ మహమ్మారి వైరస్‌ను త్వరితంగా గుర్తించడం కూడా కీలకం. ఈ నేపథ్యంలో టాటా గ్రూపు కోవిడ్‌-19ను అతి తొందరగా గుర్తించే కిట్‌ను సోమవారం ప్రారంభించింది. దీని ద్వారా కేవలం 90 నిమిషాల్లోనే కరోనా వైరస్‌ ఉనికిని కనిపెట్టవచ్చని టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ తెలిపింది.  ఇది ప్రస్తుతం ఉన్న వాటికంటే మరింత సమర్థవంతంగా, విశ్వసనీయంగా  పనిచేస్తుందని పేర్కొంది.  

దేశవ్యాప్తంగా పరీక్షల సామర్థ్యాన్ని భారీగా పెంచే లక్ష్యంతో దీన్ని ఆవిష్కరించామని సంస్థ సీఈఓ గిరీష్ కృష్ణమూర్తి వెల్లడించారు. 90 నిమిషాల్లో తుది ఫలితాన్ని అందించే తమ కిట్‌కు ప్రభుత్వ ఆమోదం లభించిందన్నారు. దక్షిణ భారతదేశంలోని చెన్నైలోని టాటా ప్లాంట్లో దీన్ని తయారు చేయనున్నామని చెప్పారు. నెలకు పది లక్షల టెస్ట్‌ కిట్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నామన్నారు. భారతదేశం అంతటా ఈ పరీక్షను అందుబాటులోకి తెచ్చేందుకు పలు ఆసుపత్రులు, వివిధ డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఇతర ప్రయోగశాలలతో భాగస్వామ్యం కోసం యోచిస్తున్నట్టు చెప్పారు. వచ్చే నెల(డిసెంబరు)నాటికి ఈ కిట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కృష్టమూర్తి వెల్లడించారు. కాగా సోమవారం నాటి గణాంకాల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య 8.55 మిలియన్లకు చేరుకోగా, 1,26,611 మరణాలు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు