టాటాల చేతికి 1ఎంజీ?

6 Nov, 2020 11:58 IST|Sakshi

ఆన్ లైన్ ఫార్మసీ 1ఎంజీపై టాటా గ్రూప్ కన్ను

మెజారిటీ వాటా కొనుగోలుకి చర్చలు షురూ?

మెడ్ ప్లస్, నెట్ మెడ్స్, ఫార్మీజీతో మరింత పోటీ

బెంగళూరు: దేశీయంగా ఆన్ లైన్ ఫార్మసీ రంగంలో పోటీ మరింత తీవ్రంకానుంది. కోవిడ్-19 కారణంగా కొద్ది రోజులుగా ఆన్ లైన్ ఫార్మసీ రంగం జోరందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆన్ లైన్ ఫార్మసీ కంపెనీ 1ఎంజీలో మెజారిటీ వాటా కొనుగోలుకి పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ చర్చలు నిర్వహిస్తున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. తద్వారా ఈ విభాగంలో ప్రధాన కంపెనీలైన మెడ్ ప్లస్, నెట్ మెడ్స్, ఫార్మీజీ, 1ఎంజీ మధ్య పోటీ తీవ్రతరం కానున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే నెట్ మెడ్స్ ప్రమోటర్ కంపెనీ విటాలిక్ లో రిలయన్స్ రిటైల్ 60 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇదేవిధంగా క్లౌడ్ టెయిల్ తో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. క్లౌడ్ టెయిల్లో అమెజాన్ 24 శాతం వాటా పొందింది. కాగా.. సీక్వోయా క్యాపిటల్ దన్నుగా సేవలందిస్తున్న 1ఎంజీ ఇటీవల 10 కోట్ల డాలర్ల(రూ. 740 కోట్లు) సమీకరణకు సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. ఇవి ఫలించనట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.  

సూపర్ యాప్
ఈకామర్స్ బిజినెస్ కోసం టాటా గ్రూప్.. సూపర్ యాప్ ను రూపొందిస్తోంది. దీనిలో భాగంగా పలు ఆన్ లైన్ కంపెనీలలో వాటాల కొనుగోలుపై కన్నేసినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే అటు టాటా గ్రూప్ ప్రతినిధులు, ఇటు 1ఎంజీ సీఈవో ప్రశాంత్ టాండన్ ఈ అంశంపై స్పందించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. కాగా.. ఆన్ లైన్ గ్రోసరీ కంపెనీ బిగ్ బాస్కెట్లోనూ 50 శాతం వాటా కొనుగోలుకి టాటా గ్రూప్ సిద్ధపడుతున్నట్లు వార్తలు వెలువడిన విషయం విదితమే. ఇందుకు బిలియన్ డాలర్లు(రూ. 7,400 కోట్లు) వెచ్చించనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. తద్వారా డిజిటల్ రిటైల్ ను భారీగా విస్తరించేందుకు టాటా గ్రూప్ ప్రణాళికలు వేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

అవకాశాలు అధికం
లాక్ డవున్ల నేపథ్యంలో ఇటీవల ఆన్ లైన్ ఫార్మసీ రంగం వేగంగా ఎదుగుతున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.  ఈ సమయంలో 9 మిలియన్ కుటుంబాలు ఈఫార్మసీ సేవలు పొందినట్లు ఫ్రాస్ట్ అండ్ సలివాన్ నివేదిక పేర్కొంది. 2025కల్లా 7 కోట్ల కుటుంబాలకు ఈఫార్మసీ సేవలు అందే వీలున్నట్లు అంచనా వేసింది. దీనికితోడు ఆన్ లైన్ ఫార్మసీ కంపెనీలు ఆన్ లైన్ ల్యాబ్ టెస్టింగ్, డాక్టర్ సేవలు, బీమా క్లెయిములు వంటి సర్వీసులను సైతం అందించే ప్రయత్నాల్లో ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఈఫార్మసీ సర్వీసులకు డిమాండ్ పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు