ఎయిర్‌ఏషియాలో టాటాకు 51 శాతం వాటా?

24 Nov, 2020 15:15 IST|Sakshi

టాటా గ్రూప్‌ నుంచి 5 కోట్ల డాలర్ల పెట్టుబడులు

ఈక్విటీ, రుణాల ద్వారా ఎయిర్‌ఏషియాకు నిధులు

తద్వారా కంపెనీలో టాటా గ్రూప్‌ వాటా 51 శాతానికి!

ముంబై, సాక్షి: భాగస్వామ్య సంస్థ ఎయిర్‌ఏషియా ఇండియాలో టాటా గ్రూప్‌ మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. కోవిడ్‌-19 నేపథ్యంలో కంపెనీకి అత్యవసర ప్రాతిపదికన టటా గ్రూప్‌ 5 కోట్ల డాలర్ల(సుమారు రూ. 375 కోట్లు)ను అందించనున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. ఈక్విటీ, రుణాల రూపంలో ఈ నిధులను అందించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశాయి. దీంతో ఎయిర్‌ఏషియాలో టాటా గ్రూప్‌ వాటా 51 శాతం ఎగువకు చేరే వీలున్నట్లు పేర్కొన్నాయి. ఎయిర్‌ఏషియా గ్రూప్‌నకు మలేసియన్‌ భాగస్వామ్య సంస్థ నిధులను సమకూర్చడానికి విముఖత చూపుతున్న నేపథ్యంలో టాటా గ్రూప్‌ ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. 

భాగస్వామి కోసం
ఎయిర్‌ఏషియా నుంచి మలేషియన్‌ భాగస్వామి తప్పుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎయిర్‌ఏషియాలో కొనసాగేందుకే టాటా గ్రూప్‌ ఆసక్తి చూపుతున్నట్లు సంబంధితవర్గాలు వెల్లడించాయి. ఎయిర్‌ఏషియాకు భవిష్యత్‌లో పెట్టుబడులను సమకూర్చగల భాగస్వామి కోసం టాటా గ్రూప్‌ చూస్తున్నట్లు తెలియజేశాయి. దేశీయంగా విమానయాన రంగానికి సంబంధించి కోవిడ్‌-19ను పక్కనపెట్టి సాధారణ పరిస్థితులకు అనుగుణంగా టాటా గ్రూప్‌ ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించాయి. వెరసి మధ్యకాలానికి తిరిగి దేశీ విమానయాన రంగం జోరందుకోనున్నట్లు టాటా గ్రూప్‌ భావిస్తోంది. 

అవకాశాలు..
దేశీయంగా చౌక ధరల విమానయానానికి పలు అవకాశాలున్నట్లు టాటా గ్రూప్‌ అంచనా వేస్తోంది. 30 ఎయిర్‌బస్‌ A320 విమానాలను కలిగి ఉన్న కంపెనీలో 2,500 మంది విధులు నిర్వహిస్తున్నారు. 600 మంది పైలట్లు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. 2014లో ప్రారంభమైన కంపెనీ ఇంతవరకూ లాభాలు ఆర్జించకపోవడం గమనార్హం! కాగా.. మరోపక్క సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిపి టాటా గ్రూప్‌ విస్తారాను ఏర్పాటు చేసిన విషయం విదితమే. విస్తారాలో టాటా గ్రూప్‌ 51 శాతం, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ 49 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. ఈ రెండు సంస్థలూ విస్తారాకు ఇటీవల రూ. 585 కోట్ల నిధులను అందజేశాయి. 

మరిన్ని వార్తలు