బిగ్‌బాస్కెట్‌ కొనుగోలుకు టాటా రెడీ

13 Mar, 2021 05:15 IST|Sakshi

64.3 శాతం వాటా కోసం ప్రతిపాదన 

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గ్రోసరీ ప్లాట్‌ఫామ్‌ బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకి టాటా గ్రూప్‌ ప్రతిపాదించింది. కాంపిటీషన్‌ కమిషన్‌(సీసీఐ)కు చేసిన దరఖాస్తు ప్రకారం బిగ్‌బాస్కెట్‌లో 64.3 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. ప్రతిపాదిత వివరాల ప్రకారం టాటా డిజిటల్‌(టీడీఎల్‌), బిగ్‌బాస్కెట్‌ నిర్వాహక సంస్థ సూపర్‌మార్కెట్‌ గ్రోసరీ సప్లైస్‌(ఎస్‌జీఎస్‌)లో 64.3 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. డీల్‌ను ప్రైమరీ, సెకండరీ కొనుగోళ్ల ద్వారా పూర్తిచేయనున్నట్లు తెలుస్తోంది.

టాటా సన్స్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన టీడీఎల్‌ టెక్నాలజీ సర్వీసులను అందిస్తోంది. వీటిలో ఐడెంటిటీ, యాక్సెస్‌ మేనేజ్‌మెంట్, లాయల్టీ ప్రోగ్రామ్, ఆఫర్లు, చెల్లింపులు తదితర సేవలున్నాయి. ప్రతిపాదిత వాటా కొనుగోలు కారణంగా పోటీ లేదా పోటీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులూ వాటిల్లబోవంటూ సీసీఐకు టీడీఎల్‌ నివేదించింది. గత కొద్ది రోజులుగా బిగ్‌బాస్కెట్‌ కొనుగోలుకి టాటా గ్రూప్‌ ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వెలువడుతున్న విషయం విదితమే. ఈ డీల్‌ ద్వారా చైనీస్‌ దిగ్గజం అలీబాబా తదితర సంస్థలు బిగ్‌బాస్కెట్‌లో వాటాను విక్రయించేందుకు వీలు చిక్కనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 2011లో ప్రారంభమైన బిగ్‌బాస్కెట్‌ దేశవ్యాప్తంగా 25 పట్టణాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఈ విభాగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, గ్రోఫర్స్‌ తదితర దిగ్గజాలతో పోటీ పడుతోంది.

మరిన్ని వార్తలు