లాభాల పంట పండిస్తోన్న టాటా షేర్లు

13 Oct, 2021 15:35 IST|Sakshi

షేర్‌ మార్కెట్‌లో టాటాగ్రూపు హవా నడుస్తోంది. ఏ రంగం, ఏ బిజినెస్‌ అనే తేడా లేకుండా టాటా షేరు అయితే చాలు కొనేస్తాం అన్నట్టుగా ఇన్వెస్టర్లు పోటీ పడుతున్నారు. దీంతో టాటా గ్రూపుకు చెందిన వివిధ కంపెనీల షేర్లు గరిష్టాలను తాకుతున్నాయి. 

భారతీయ మార్కెట్‌లో టాటాలకు ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో ఉన్ని కంపెనీలు ఉన్నా కొత్తగా ఎన్ని కంపెనీలు వస్తున్నా బ్రాండ్‌ ఇమేజ్‌లో టాటాలకు దీటుగా నిలవలేకపోతున్నాయి. ఇటీవల ఎయిర్‌ ఇండియాను టాటాలు తిరిగి సొంతం చేసుకున్నప్పుడు దేశంలో మెజారిటీ ప్రజలు ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని స్వాగతించారు. ఆ డీల్‌ కుదిరి వారం రోజుల కూడా కాకముందే ఎలక్ట్రిక్‌ వాహనాల సెగ్మెంట్‌లో విస్తరణకు సంబంధించి టీపీజీ గ్రూపుతో బిలియన్‌ డాలర్ల ఒప్పందం టాటా చేసుకుంది.

ఇటు ఎయిర్‌లైన్స్‌తో పాటు అటు ఎలక్ట్రిక్‌ వాహనాల వ్యాపారంలో టాటా దూకుడుగా వ్యవహరించడంలో మరోసారి టాటా లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు పోటీ పడ్డారు. ఫలితంగా మొదట టాటా మోటార్స్‌ షేర్లు రికార్డు ఇంట్రాడేలో స్థాయిలో 20 శాతం వృద్ధిని నమోదు చేసి ఆల్‌టైం హైని టచ్‌ చేశాయి. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో టాటా మోటార్‌ షేర్లు ఇటు బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలలో దాదాపు 21 శాతం లాభపడ్డాయి. షేరు ధర ఎన్‌ఎస్‌ఈలో రూ. 509 దగ్గర బీఎస్‌ఈలో రూ. 508.25 దగ్గర ట్రేడవుతోంది. దీంతో టాటా మోటార్స్‌ మార్కెట్‌ క్యాపిటల్‌ విలువ రూ.1,49,774 కోట్లకు చేరుకుంది.

- టాటా గ్రూపు నుంచి మొత్తం 17 కంపెనీలు రెండు స్టాక్‌ మార్కెట్లలో లిస్టయి ఉండగా ఇందులో కేవలం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ మాత్రమే స్వల్పంగా 0.04 శాతం నష్టపోగా మిగిలిన పదహారు కంపెనీల షేర్లు వృద్దిని కనబరుస్తూ లాభాల్లో ఉన్నాయి. 

- టాటా కెమికల్స్‌ లిమిటెడ్‌ ఎన్‌ఎస్‌ఈ (15.4), బీఎస్‌ఈలలో (14.6) శాతం వృద్దితో షేరు విలువ రూ.1120 దగ్గర ట్రేడవుతోంది. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాపిటల్‌ విలువ రూ.24,720 కోట్లకు చేరుకుంది. టాటా పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీని షేర్లు రూ.224 దగ్గర ట్రేడవుతుండగా మార్కెట్‌ క్యాపిటల్‌ విలువ రూ. 62,564 కోట్లకు చేరుకుంది. టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ సైతం 14 శాతం వృ‍ద్ధిని నమోదు చేసింది.

సగం విలువ అక్కడే
వందేళ్ల చరిత్ర ఉన్న టాటా గ్రూపు నుంచి సాల్ట్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ వరకు రకరకాల ఉత్పత్తులను అందిస్తోంది, అయితే టాటా గ్రూపు మార్కెట్‌ క్యాపిటల్‌ విలువలో సగానికి పైగా స్థానాన్ని టెక్నాలజీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ నమోదు చేసింది. టీసీఎస్‌ మార్కెట్‌ క్యాపిటల్‌ విలువ ఏకంగా రూ.13,51,596 కోట్టుగా ఉంది. మిగిలిన అన్ని గ్రూపుల మార్కెట్‌ క్యాపిటల్‌ కలిపినా టీసీఎస్‌కి సమంగా లేదు. 

చదవండి: అప్పుడు చైనాపై రెచ్చిపోయి..! ఇప్పుడు ష్‌.. గప్‌చుప్‌

మరిన్ని వార్తలు