టాటా గ్రూప్‌ దిగ్గజం, రతన్‌ టాటాకి ఆప్తుడు కృష్ణకుమార్‌ కన్నుమూత

2 Jan, 2023 08:54 IST|Sakshi

ముంబై: రతన్‌​ టాటాకి అత్యంత సన్నిహితుడు, టాటా గ్రూప్‌లో పలు అత్యున్నత బాధ్యతలు నిర్వర్తించిన ఆర్‌ కృష్ణకుమార్‌(84) ఇక లేరు. ఆదివారం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ సాయంత్రం కన్నుమూశారు.  

పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన ఆర్‌ కృష్ణకుమార్‌.. కేరళ తలస్సెరీలో పుట్టిపెరిగారు. చెన్నైలో ఉన్నత చదువులు పూర్తి చేసి.. 1963లో టాటా గ్రూప్‌లో అడుగుపెట్టారు. టాటా సన్స్‌కు డైరెక్టర్‌గానే కాదు, గ్రూప్‌లో పలు కంపెనీల టాప్‌ పొజిషన్‌లో ఆయన పని చేశారు. ట్రస్ట్‌ల బాధ్యతలను కూడా ఆయన చూసుకున్నారు. టాటాలోని వివిధ సంస్థలతో పాటు దాని అనుబంధ సంస్థ ఇండియన్‌ హోటల్స్‌కు హెడ్‌గానూ ఆయన పని చేశారు. దూకుడు నిర్ణయాలకు కేరాఫ్‌గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది.

టాటా సంస్థలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన తర్వాత కూడా ఆయన పలు కీలక నిర్ణయాల్లో ముఖ్యభూమిక పోషించారు. వ్యాపార కార్యనిర్వాహకుడిగానే కాకుండా.. దాదాపు ఒకే వయసు వాళ్లు కావడంతో రతన్‌ టాటాతో కృష్ణకుమార్‌కు మంచి అనుబంధం కొనసాగింది. సైరస్‌ మిస్ట్రీ తొలగింపు ఎపిసోడ్‌లో.. రతన్‌ టాటాకు కీలక సూచనలు చేసిన బృందంలో ఈయన కూడా ఉన్నారు. 2009లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించింది.

ఇక కృష్ణకుమార్‌ మృతి టాటా గ్రూప్‌ స్పందించింది. టాటా సన్స్‌ ప్రస్తుత చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ పేరిట సంతాప ప్రకటన విడుదల చేసింది. టాటా గ్రూప్‌నకు ఆయన చేసిన సేవలు మరువలేనివని అందులో చంద్రశేఖరన్‌ కొనియాడారు. మరోవైపు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సైతం కృష్ణకుమార్‌ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముంబైలోని చందన్‌వాడీ శ్మశానవాటికలో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు