టాటా మోటార్స్ చరిత్రలోనే అరుదైన రికార్డ్.. ఇదే!

3 Mar, 2023 12:55 IST|Sakshi

భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఒకప్పటి నుంచి, ఇప్పటి వరకు కూడా అధిక ప్రజాదరణ పొందుతూ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది, ఇటీవల కంపెనీ ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తిలో ఒక కొత్త మైలురాయిని చేరుకుంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని కంపెనీ ఈ రోజు వెల్లడించింది.

టాటా మోటార్స్ 1998 నుంచి ఇప్పటి వరకు ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తిలో 5 మిలియన్లకు చేరుకుంది. గత 2.5 సంవత్సరాలలో 1 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేసినట్లు, ఆ తరువాత 2004లో 1 మిలియన్, 2010లో రెండవ మిలియన్‌ను సాధించి, 2015లో 3 మిలియన్ల మార్కును చేరుకుంది. 2020 నాటికి కంపెనీ 4 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేసింది.

మొత్తం మీద ప్యాసింజర్ కార్ల ఉత్పత్తిలో ఎట్టకేలకు 5 మిలియన్ మార్కుని చేరుకుంది. టాటా మోటార్స్ చరిత్రలో ఈ రోజు మరచిపోలేని రోజు. కంపెనీ ఇలాంటి గొప్ప రికార్డ్స్ సాధించడంలో ఎప్పుడు ముందు ఉంటుందని, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అండ్ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు.

గత కొంత కాలంలో ప్రపంచం కరోనా మహమ్మారి కోరల్లో నలుగుతున్న సమయంలో, సెమికండక్టర్ చిప్ కొరత ఉన్నప్పటికీ కంపెనీ ఈ 5 మిలియన్ ప్రొడక్షన్ రికార్డ్ కైవసం చేసుకుంది. ఈ రికార్డ్ సృష్టించడానికి కారకులైన ఉద్యోగులకు, కష్టమరలకు కంపెనీ కృతఙ్ఞతలు తెలిపింది. 

ఐదు మిలియన్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న సందర్భంగా టాటా మోటార్స్ భారతదేశంలోని కస్టమర్‌లు మరియు ఉద్యోగుల కోసం ఒక వేడుక ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగానే కంపెనీ తమ తయారీ ప్రదేశాలు, ప్రాంతీయ కార్యాలయాల్లో నెల రోజుల పాటు వేడుకలను కొనసాగిస్తుంది.

మరిన్ని వార్తలు