ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ రికార్డు

24 Sep, 2021 14:58 IST|Sakshi

ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఈవీ అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. మన దేశంలో 10 వేల ఎలక్ట్రిక్ కార్లను అమ్మిన సంస్థగా టాటా మోటార్స్ నిలిచింది. 10,000వ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసిన వినియోగదారుడికి నేడు (సెప్టెంబర్ 24) అందజేసింది. ఈవీ మార్కెట్లో 70 శాతం వాటాను టాటా మోటార్స్ ఆక్రమించింది. 2021 ఆగస్టులో 1,000 పైగా యూనిట్లను సేల్ చేసింది. ముంబైకి చెందిన ఆటోమేకర్ భారతదేశంలోని 120 నగరాల్లో 700కి పైగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అందించడం వల్ల ఇంత త్వరగా ఈ మైలు రాయిని చేరుకున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.(చదవండి: నవంబర్‌ 10న.. ఏం జరగబోతోంది?)

టాటా మోటార్స్ తన ఈ-మొబిలిటీ ఎకోసిస్టమ్ టాటా పవర్, టాటా మోటార్స్ ఫైనాన్స్, టాటా కెమికల్స్, టాటా ఆటోకాంప్, క్రోమాల సహాయంతో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తుంది. టాటా బ్రాండ్ పై నమ్మకం ఉంచిన ప్రతి వినియోగదారుడికి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ అధ్యక్షుడు శైలేష్ చంద్ర ధన్యవాదాలు తెలిపారు. టాటా మోటార్స్ ఇటీవల వ్యక్తిగత వాహన విభాగంలో తన రెండవ ఈవీ టాటా టిగోర్ కారును విడుదల చేసింది.

ఎక్స్ఈ, ఎక్స్ఎం, ఎక్స్ జెడ్ ప్లస్ అనే మూడు వేరియంట్లలో ఈ టిగోర్ ఈవీ లభిస్తుంది. టాటా టిగోర్ ఎక్స్ఈ వేరియంట్ ధర రూ.11.45 లక్షలుగా ఉంది. ఎక్స్ఎం వేరియంట్ ధర రూ.12.49 లక్షలు కాగా, ఎక్స్ జెడ్ ప్లస్ వేరియంట్ ధరను రూ. 12.99 లక్షలుగా నిర్ణయించింది. భద్రత పరంగా ఇచ్చే గ్లోబల్ ఎన్సీఏపీ.. ఈ వాహనానికి 4 స్టార్స్ రేటింగ్ ఇచ్చింది. ఈ వాహనం రేంజ్ 306 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 

>
మరిన్ని వార్తలు