మళ్లీ కార్ల ధరలు పెంచిన టాటా మోటార్స్!

2 Aug, 2021 19:10 IST|Sakshi

దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహనాల ధరలను వేరియంట్, మోడల్ బట్టి సగటున 0.8 శాతం ఆగస్టు 3 నుంచి పెంచనున్నట్లు ప్రకటించింది. అంతేగాక, ఆటోమేకర్ 31 ఆగస్టు, 2021 వరకు అన్ని రిటైల్ ధరలపై రక్షణను కూడా అందిస్తోంది. "టాటా మోటార్స్ ఇటీవల తన వినియోగదారులు, డీలర్లు, సరఫరాదారుల ప్రయోజనాలను రక్షించడానికి సమగ్రమైన 'బిజినెస్ అజిలిటీ ప్లాన్'ను ఏర్పాటు చేసినట్లు" అని ఒక ప్రకటనలో తెలిపింది.

పీటీఐ నివేదిక ప్రకారం, స్టీల్, ఇతర విలువైన లోహాల ధరలు భారీగా పెరగడంతో కార్ల తయారీ వ్యయాన్ని భర్తీ చేయాడానికి ఆటోమేకర్ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ప్రయాణీకుల వాహన ధరలను పెంచినట్లు పేర్కొంది. ముంబైకి చెందిన ఆటో మేజర్ టియాగో, నెక్సన్, హారియర్, సఫారీ వంటి ప్రయాణీకుల వాహనాలను దేశీయ మార్కెట్లో విక్రయిస్తుంది. ఈ నెల ప్రారంభంలో, దేశంలోని అతిపెద్ద కార్ల తయారీసంస్థ మారుతి సుజుకి ఇండియా ఇన్ పుట్ ఖర్చుల భారాన్ని తగ్గించడానికి హ్యాచ్ బ్యాక్ స్విఫ్ట్, సీఎన్ జి వేరియెంట్ల ధరలను ₹15,000 వరకు పెంచింది. అదేవిధంగా, హోండా మోటార్స్ ఆగస్టు నుంచి భారతదేశంలో తన మొత్తం మోడల్ శ్రేణి ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే పెరిగిన కమోడిటీ ధరలను భర్తీ చేయాలని కార్ల తయారీ సంస్థలు చూస్తున్నాయి.

మరిన్ని వార్తలు