Automobiles Shares In Profits: జోరమీదున్న ఆటోమొబైల్స్‌ షేర్స్‌.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు

16 Nov, 2021 15:00 IST|Sakshi

Tatamotors, Maruti Suzuki, share price: స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో కొనసాగుతుంటే ఆటో మొబైల్‌ ఇండసక్ట్రీ షేర్లు లాభాల పంట పండిస్తున్నాయి. ముఖ్యంగా టాటా మోటార్స్‌, మారుతి సుజుకి షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. మరోవైపు ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఈ షేర్లు ఇన్వెస్టర్లకు తక్షణ లాభాలను అందిస్తున్నాయి.

ఎగబాకిన టాటా షేర్లు
టాటా మోటార్‌ కంపెనీ షేర్లు మంగళవారం హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ రోజు ఉదయం మార్కెట్‌లో ఒక్కో షేరు ధర రూ.507లు ఉండగా మధ్యాహ్నం సమయానికి షేర్ల ధరలు రివ్వున ఎగిశాయి. ఒక్కో షేరు ధర రూ.15 వంతున పెరిగి 2.97 శాతం వృద్ధితో రూ.520.45 దగ్గర ట్రేడ్‌ అవుతున్నాయి. ఏడాది కాలంలో టాటా మోటార్‌ షేరు ఏకంగా 229 శాతం వృద్ధిని నమోదు చేసింది. పైగా ఈవీ కారు మార్కెట్‌లో టాటానే నంబర్‌ వన్‌గా ఉంది. ఇటీవల టాటా నుంచి వచ్చిన హారియర్‌, టియాగో, పంచ్‌ మోడళ్లకు ఆదరణ బాగుండటంతో టాటా షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇన్వెస్టర్ల ఆసక్తి
గత మూడు నెలలుగా కొనసాగిన బుల్‌ జోరులో టాటా పవర్‌ షేర్లు బాగా లాభాలను అందించాయి. ఏడాది వ్యవధిలో 324 శాతం వృద్ధిని నమోదు చేశాయి. టాటా పవర్‌ షేర్ల ధర రూ.57 నుంచి రూ.244 వరకు పెరిగింది. అదే తరహాలో టాటా మోటార్‌ షేర్లు కూడా పెరగవచ్చనే సెంటిమెంట్‌ తోడవటంతో ఇన్వెస్టర్లు టాటా మోటార్‌ షేర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 229 శాతం వృద్ధి నమోదు అయ్యింది. రాబోయే రోజుల్లో మరింత పెరగవచ్చనే ప్రచారం మార్కెట్‌ వర్గాల్లో సాగుతోంది. 

మారుతి సైతం
స్టాక్‌మార్కెట్‌లో మంగళవారం మారుతి సుజూకి షేర్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించాయి. ఈ రోజు ఉదయం ఒక్కో షేరు ధర రూ. 7,546లు ఉండగా మధ్యాహ్నం 2:51 గంటల సమయానికి 7.13 శాతం వృద్ధిని కనబరిచింది. ఒక్కో షేరు ధర ఏకంగా రూ.534 పెరిగి షేరు ధర రూ. 8,038 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. దీంతో ఇంట్రా డే ట్రేడింగ్‌లో మారుతి షేర్లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు