టాటా మోటార్స్‌ కొత్త బాస్‌ ఎవరంటే?

13 Feb, 2021 11:43 IST|Sakshi

సాక్షి, ముంబై:  భారతదేశపు అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ లిమిటెడ్‌  కొత్త బాస్‌ను ఎన్నుకుంది. ప్రస్తుత సీఎండీ పదవిని వీడనున్న తరుణంలో  2021 జూలై 1 నుండి మార్క్ లిస్టోసెల్లాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించినట్లు టాటా మోటార్స్ శుక్రవారం (నిన్న) ప్రకటించింది. ప్రస్తుత ఎండీ, సీఈవో గుంటర్‌ బషెక్‌ స్థానంలో ఈ కొత్త నియామకం జరగింది.  బషెక్‌ వ్యక్తిగత కారణాలతో  జర్మనీకి మారనున్న సంగతి తెలిసిందే.

మార్క్‌ నియామకంపై టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశంలో విస్తృతమైన కార్యాచరణ వాణిజ్య వాహనాల్లో అపార అనుభవం, నైపుణ్యంతో మార్క్‌ ఆటోమోటివ్ బిజినెస్ లీడర్‌గా ఉన్నారన్నారు. మార్క్‌ సారధ్యంలో సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తన నూతన బాధ్యతలపై మార్క్‌ స్పందిస్తూ భారత్‌తో తనకున్న​ అనుబంధంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమంటూ ఆనందాన్ని ప్రకటించారు.  సంస్థ సామర్థ్యాన్ని సంయుక్తంగా  మరింత ముందుకు తీసుకెళతామని  చెప్పారు. గతంలో మార్క్‌ ఫ్యుజో ట్రక్‌, బస్‌ కార్పొరేషన్‌ సీఈవోగా, డెమ్లర్‌ ట్రక్స్‌ ఆసియా హెడ్‌గా  ఉన్నారు.

2016లో సీఎండీగా ఎంపికైన గుంటర్‌ బషెక్‌ నేతృత్వంలో టాటా మోటార్స్ దూసుకెళ్లింది.వ్యక్తిగత కారణాల వల్ల కాంట్రాక్ట్ చివరిలో జర్మనీకి మకాం మార్చాలని గుంటెర్ నిర్ణయించున్నారు. అయితే 2021, జూన్ 30 వరకు పదవిలో కొనసాగాలని టాటా బోర్డు చేసిన అభ్యర్థనను మన్నించారని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

కాగా కరోనా, లాక్‌డౌన్‌ సంక్షోభాలనుంచి ఇపుడిపుడే తేరుకుంటున్న టాటా మోటార్స్ డిసెంబర్ త్రైమాసికంలో గత 33 త్రైమాసికాలలో లేని అత్యధిక లాభాలను గడించింది. వార్షిక ప్రాతిపదికన  67.2 శాతం పెరిగి 2,906 కోట్ల లాభాలను ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి 5.5 శాతం పుజుకుని 75,654 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఏడాది క్రితం ఇది 71,676 కోట్ల రూపాయలు.

మరిన్ని వార్తలు