జనవరి 1 నుంచి ఖరీదు కానున్న కార్లు, టాటా సహా అన్నీ! కారణం ఇదే..

11 Dec, 2021 08:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

TATA Motors Increase Prices On All Vehicles: కొత్త సంవత్సరంలో కొత్తకారు కొనాలనుకుంటున్న వాళ్లకు టాటా మోటార్స్‌ షాకిచ్చింది. ఈ వాహన తయారీ సంస్థ అన్ని ప్యాసింజర్‌ వెహికిల్స్‌ ధరలను జనవరి 1వ తేదీ నుంచి పెంచుతోంది. దీంతో టాటా మోటార్స్‌ కార్లు ఖరీదు కానున్నాయి. అయితే ఎంత శాతం సవరిస్తున్నదనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. 


ముడిసరుకు వ్యయాలు క్రమంగా అధికం అవుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ బిజినెస్‌ యూనిట్‌ ప్రెసిడెంట్‌ శైలేశ్‌ చంద్ర తెలిపారు. మరోవైపు కమర్షియల్‌ వెహికల్స్‌ ధరలను సైతం పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ఈమధ్యే ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ, మధ్య, తేలిక వాహనాలతో పాటు చిన్నస్థాయి వాణిజ్య వాహనాలు, బస్సులకు ఈ పెంపు వర్తించనుందని తెలిపింది. ఇక ఈ కమర్షియల్‌ వాహనాలపై 2.5 శాతం పెంపు జనవరి 1, 2022 నుంచి అమలుకానుంది. 

డుకాటీ సైతం 
కాగా, లగ్జరీ మోటార్‌సైకిల్‌ బ్రాండ్‌ డుకాటీ సైతం వచ్చే నెల 1 నుంచి అన్ని మోడళ్ల ధరలను పెంచుతోంది. ‘ఇక్కడి మార్కెట్లో అత్యంత పోటీతత్వంతో వాహనాల ధరలను ఉంచేందుకు తీవ్రంగా ప్రయత్నించాం. ముడి సరుకు, ఉత్పత్తి, రవాణా ఖర్చుల పెరుగుదలకు అనుగుణంగా ధరలను మార్చవలసి వస్తోంది’ అని వివరించింది.
 

ఇదిలా ఉంటే దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజూకి కార్ల ధరలను పెంచుతున్నట్టు హఠాత్తుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే హోండా, రెనాల్ట్‌ కంపెనీలు కూడా ధరలను ధరల పెంపును సమీక్షించే యోచనలో ఉండగా.. అడీ కంపెనీ ఏకంగా 3 శాతం పెంచేసింది.

కోవిడ్‌ సంక్షోభం కారణంగా ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది,. కానీ, కార్ల తయారీలో కీలకమైన స్టీలు, రోడియం మెటీరియల్‌ల ధరలు బాగా పెరగడం, దీనికి తోడు సెమికండర్ల కొరత సైతం కంపెనీలకు ఇబ్బందిగా మారింది. ఈ కారణాలతో ధరలు పెంచక తప్పట్లేదని కంపెనీలు చెప్తున్నాయి.

కార్ల రేట్లు రయ్‌.. రయ్‌!

మరిన్ని వార్తలు