కొత్త వాహనం కొనేవారికి టాటా మోటార్స్ షాక్!

21 Sep, 2021 15:34 IST|Sakshi

మీరు కొత్తగా వాణిజ్య వాహనాలు కొనుగోలుచేయాలని చూస్తున్నారా? అయితే, మీకు చేదువార్త. దేశంలోని అతిపెద్ద ఆటోమేకర్ టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలను అక్టోబర్ 1, 2021 నుంచి 2 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. ధరల పెంపు అనేది మోడల్, వాహనం వేరియంట్ ఆధారంగా ఉండనున్నట్లు కంపెనీ ఒక ఫైలింగ్ లో తెలిపింది. తయారీ, నిర్వహణ, ముడిసరకుల వ్యయాలు పెరగడం వల్లే వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు ఆటోమేకర్ పేర్కొంది. 

"ఉక్కు, విలువైన లోహాలు వంటి ముడిసరకుల వ్యయం నిరంతరం పెరగడం వల్ల ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వస్తుంది. ధరలు భారీగా పెరగకుండా ఉండటానికి వివిధ స్థాయిలలో కొంత వరకు ఖర్చులను తగ్గించడానికి కంపెనీ మరింత కృషి చేస్తుంది" అని టాటా మోటార్స్ తెలిపింది. కేవలం 2 నెలల కంటే తక్కువ కాలవ్యవదిలోనే వాహనాల ధరలు పెరగడం ఇది రెండోసారి. ఆగస్టులో 'న్యూ ఫరెవర్' శ్రేణిని మినహాయించి, తన ప్రయాణీకుల వాహనాల ధరలను సగటున 0.8 శాతం పెంచింది. అప్పుడు కూడా ధరల పెరుగుదలకు ఇన్ పుట్ ధరలు పెరగడమే ప్రధాన కారణంగా పేర్కొంది.(చదవండి: టాటా మోటార్స్‌ ఎలక్ట్రిక్‌ సెడాన్‌)

టాటా మోటార్స్ అధ్యక్షుడు ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ శైలేష్ చంద్ర వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. "గత ఏడాదికాలంలో ఉక్కు & విలువైన లోహాల ధరలు గణనీయంగా పెరిగాయి" అని చెప్పారు. గత ఏడాది ఆర్థిక ప్రభావం వల్ల కమోడిటీ ధరలు 8-8.5 శాతం పెరిగినట్లు శైలేష్ చంద్ర తెలిపారు. కేవలం టాటా మోటార్స్ మాత్రమే వాహనాల ధరలను పెంచడం లేదు. ఇతర ఆటోమేకర్ సంస్థలు కూడా ధరలను పెంచుతున్నాయి.

మరిన్ని వార్తలు