ఈ ఏడాదీ వాహనాల జోరు

17 Jan, 2023 06:37 IST|Sakshi

అంచనా వేస్తున్న కంపెనీలు

గ్రేటర్‌ నోయిడా: దేశవ్యాప్తంగా ఈ ఏడాది సైతం వాహనాల జోరు ఉంటుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 2022లో 5 లక్షల యూనిట్లు విక్రయించిన టాటా మోటార్స్‌.. 2023లో ఉత్తమ పనితీరు ఉంటుందని ఆశాభావంతో ఉంది. కొత్తగా వచ్చిన మోడళ్లు ఇందుకు దోహదం చేస్తాయని టాటా మోటార్స్‌ ప్యాసింజర్, ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఎండీ శైలేష్‌ చంద్ర తెలిపారు. రెండంకెల వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు.

గతేడాది 43,000 ఎలక్ట్రిక్‌ వాహనాలు విక్రయించామని, కొత్త మోడళ్ల చేరికతో ఈ ఏడాది ఇంకా పెరుగుతాయని చెప్పారు. పరిశ్రమ కంటే మెరుగ్గా ఈ ఏడాది కూడా రెండంకెల వృద్ధితో అమ్మకాలు ఉంటాయని కియా ఇండియా వైస్‌ ప్రెసిడెంట్, సేల్స్, మార్కెటింగ్‌ హెడ్‌ హర్‌దీప్‌ సింగ్‌ బ్రార్‌ వెల్లడించారు. 2022లో పరిశ్రమ 23 శాతం వృద్ధి సాధిస్తే, కంపెనీ 40 శాతం నమోదు చేసిందని వివరించారు. కియా మార్కెట్‌ వాటా 5.9 నుంచి 6.7 శాతానికి ఎగసిందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల కారణంగా 2023లో పరిశ్రమకు ఎదురుగాలులు ఉంటాయని అన్నారు.  

తయారీ సామర్థ్యం పెంపు..
అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉంటుందని హ్యుండై మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్‌ తెలిపారు. ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్‌ వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. వాహన పరిశ్రమ తొలిసారిగా అత్యధిక విక్రయాలను గతేడాది నమోదు చేసిందని హెచ్‌ఎంఐఎల్‌ సీవోవో తరుణ్‌ గర్గ్‌ వివరించారు. అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ భారత్‌ మెరుగ్గా పనితీరు కనబరుస్తుందని అన్నారు. ఈ ఏడాది జూన్‌ నుంచి 8.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యానికి చేర్చాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం సామర్థ్యం 7.6 లక్షల యూనిట్లు ఉంది. సెమికండక్టర్‌ సరఫరా మెరుగవడంతో పేరుకుపోయిన ఆర్డర్లను తగ్గించుకోవాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం 1.15 లక్షల పెండింగ్‌ ఆర్డర్లు ఉన్నాయి. వీటిలో అత్యధికం క్రెటా, వెన్యూ మోడళ్లు. లోకలైజేషన్‌ 85 శాతం ఉంది. ఎలక్ట్రానిక్‌ విడిభాగాలను చైనా, దక్షిణ కొరియా, యూరప్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది.   

క్యూ3లో కార్ల విక్రయాలు 23 శాతం అప్‌
పండుగ సీజన్‌ డిమాండ్‌ ఊతంతో ప్యాసింజర్‌ వాహనాల టోకు విక్రయాలు గతేడాది డిసెంబర్‌ త్రైమాసికంలో 9,34,955 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో నమోదైన 7,61,124 యూనిట్లతో పోలిస్తే 23 శాతం పెరిగాయి. దేశీ ఆటోమొబైల్‌ తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌  ఈ గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం డిసెంబర్‌ త్రైమాసికంలో కంపెనీల నుంచి డీలర్లకు 9,34,955 వాహనాలు వచ్చాయి. ఇక, డిసెంబర్‌లో ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 2,19,421 యూనిట్ల నుంచి 7 శాతం పెరిగి 2,3,309 యూనిట్లకు చేరాయి.

కమర్షియల్‌ వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ద్విచక్ర వాహనాల్లాంటి విభాగాలన్నింటిలోనూ టోకు విక్రయాలు పెరిగాయని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మీనన్‌ చెప్పారు. అమ్మకాలు పెరగడానికి పండుగ సీజన్‌ తోడ్పడినట్లు తెలిపారు. అయితే రుణాలపై వడ్డీ రేట్లు, ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం కొనసాగుతోందని పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో మొత్తం వాహన విక్రయాలు 46,68,562 యూనిట్ల నుంచి 51,59,758 యూనిట్లకు పెరిగాయి. క్యూ3లో మొత్తం వాణిజ్య వాహనాల వికయ్రాలు 17 శాతం పెరిగి 2,27,111 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాలు 6 శాతం పెరిగి 38,59,030కు చేరాయి.  

పూర్తి ఏడాదికి..
2022 పూర్తి ఏడాదికి గాను (క్యాలండర్‌ ఇయర్‌) గణాంకాలు చూస్తే ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు అత్యధికంగా 38 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. 2018 రికార్డుతో పోలిస్తే నాలుగు లక్షల యూనిట్లు అధికంగా అమ్ముడయ్యాయి. అటు కమర్షియల్‌ వాహనాల అమ్మకాలు 9.3 లక్షల యూనిట్లకు చేరాయి. 2018లో నమోదైన గరిష్ట స్థాయికి కేవలం 72,000 యూనిట్ల దూరంలో నిల్చాయి. త్రిచక్ర వాహనాల అమ్మకాలు 82,547 యూనిట్ల నుంచి 1,38,511 యూనిట్లకు చేరాయి. అయినప్పటికీ 2010తో పోలిస్తే ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి.   


ఎక్స్‌యూవీ400...   20,000 యూనిట్లు
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా ఈ ఏడాది 20,000 యూనిట్ల ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకుంది. పరిచయ ఆఫర్‌లో ధర రూ.15.99 లక్షల నుంచి ప్రారంభం. 2022 సెప్టెంబర్‌లో కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. జనవరి 26 నుంచి బుకింగ్స్‌ మొదలు కానున్నాయి. మార్చి నుంచి ఈఎల్‌ వేరియంట్, దీపావళి సమయంలో ఈసీ వేరియంట్‌ డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ సోమవారం ప్రకటించింది. 34.5 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ కలిగిన ఈసీ వేరియంట్‌ కారు ఒకసారి చార్జింగ్‌తో 375 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 39.4 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీతో రూపొందిన ఈఎల్‌ ట్రిమ్‌ ఒకసారి చార్జింగ్‌తో 456 కిలోమీటర్లు పరుగెడుతుంది. ప్రతి వేరియంట్‌లో 5,000 యూనిట్లు మాత్రమే పరిచయ ఆఫర్‌ ధరలో విక్రయిస్తారు.   

మరిన్ని వార్తలు