టాటా మోటార్స్‌ ఉద్యోగులకు షాక్‌!

12 Dec, 2020 14:55 IST|Sakshi

43వేల మందికి పైగా  వీఆర్‌ఎస్‌

నాలుగేళ్లలో మూడవ సారి వీఆర్‌ఎస్‌

ఖర్చులను తగ్గించుకునే వ్యూహం​

సాక్షి, ముంబై: అతిపెద్ద వాహన తయారీ సంస్థ  టాటా మోటార్స్  తన ఉద్యోగులకు చేదు వార్త అందించింది. అమ్మకాలు లేక  ఆదాయాలు క్షీణించి ఇబ్బందులు పడుతున్న సంస్థ  టర్నరౌండ్ ప్రణాళిక,  ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల్లో  భాగంగా స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (విఆర్ఎస్) ప్రకటించింది. దాదాపు 42,597 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనుంది.  సంస్థ మొత్తం ఉద్యోగులలో సగం మంది వీఆర్ఎస్ పథకానికి అర్హులని  తాజా అంచనా ద్వారా తెలుస్తోంది.  నాలుగేళ్లలో మూడోసారి  వీఆర్‌ఎస్ పథకాన్ని టాటా మోటార్స్‌ ప్రకటించడం గమనార్హం. తాజాప్రకటన ప్రకారం  ఐదేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం సంస్థలో పనిచేసినవారు ఈ పథకానికి అర్హులు. ఉద్యోగి వయసు, సంస్థలో వారి సర్వీసు ఆధారంగా పరిహారాన్ని లెక్కించునున్నారు.  అర్హతగల ఉద్యోగులు డిసెంబర్ 11 నుండి జనవరి 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. (చైనాకు షాక్ ‌: వేలకోట్ల పెట్టుబడులు ఇండియాకు)

కాగా  గత కొన్ని సంవత్సరాలుగా తన ఉద్యోగుల వ్యయాన్ని తగ్గించడానికి  టాటా మోటార్స్  ప్రయత్నిస్తోంది.  2017లో మొదట  వీఆర్‌ఎస్‌ పథకాన్ని ప్రారంభించింది. ఆ రువాత 2019 నవంబర్‌లో 1,600 మంది ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ అందించింది. 2019 నుండి ఆటో పరిశ్రమ మందగమనం మధ్య, ఇతర ఆటో మేజర్లైన హీరో మోటోకార్ప్ లిమిటెడ్, టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్,  అశోక్ లేలాండ్ లిమిటెడ్ ఇలాంటి పథకాలను అమలు చేశాయి.  2020, సెప్టెంబర్ 30తో ముగిసిన రెండవ త్రైమాసికంలో 314.5 కోట్ల రూపాయల నష్టాన్ని కంపెనీ నివేదించింది. అంతకు ముందు ఏడాది కాలంలో కంపెనీ రూ .216.56 కోట్ల నష్టాన్ని  నమోదు చేయగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో 8,437.99 కోట్లు  రూపాయలను నష్టపోయింది. ఆటో సంక్షోభానికి తోడు కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో  డిమాండ్‌ పడిపోవడంతో ఆటో సంస్థలు మరింత కుదేలైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు