టాటా మోటార్స్‌ నష్టాలు తగ్గాయ్‌

27 Jul, 2021 00:18 IST|Sakshi

క్యూ1లో రూ. 4,450 కోట్లు 

జేఎల్‌ఆర్‌ ఆదాయం 74 శాతం అప్‌

న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో నికర నష్టం దాదాపు సగానికి తగ్గి రూ. 4,450 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 8,444 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రెట్టింపునకు ఎగసి రూ. 66,406 కోట్లను అధిగమించింది. గత క్యూ1లో రూ. 31,983 కోట్ల టర్నోవర్‌ మాత్రమే సాధించింది. ఇక స్టాండెలోన్‌ పద్ధతిలో రూ. 1,321 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతంలో రూ. 2,191 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 2,687 కోట్ల నుంచి రూ. 11,904 కోట్లకు దూసుకెళ్లింది. ఎగుమతులతో కలసి హోల్‌సేల్‌ విక్రయాలు 351 శాతం వృద్ధితో 1,14,170 యూనిట్లను తాకాయి.  

జేఎల్‌ఆర్‌ జోరు...: క్యూ1లో లగ్జరీ కార్ల బ్రిటిష్‌ అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌(జేఎల్‌ఆర్‌) ఆదాయం 74 శాతం జంప్‌చేసి 5 బిలియన్‌ పౌండ్లను తాకింది. పన్నుకు ముందు నష్టం 11 కోట్ల పౌండ్లకు చేరింది. రిటైల్‌ వాహన అమ్మకాలు 68 శాతం ఎగసి 1,24,537ను తాకాయి. కాగా.. క్యూ2(జూలై–సెప్టెంబర్‌)లో సెమీకండక్టర్ల సరఫరా కొరత మరింత తీవ్రంకానున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో టోకు అమ్మకాలు 50 శాతం ప్రభావితమయ్యే వీలున్నట్లు అంచనా వేసింది.

స్థానిక ఈవీ తయారీకి ప్రభుత్వ మద్దతు...
స్థానికంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న విధానాలను ప్రభుత్వం కొనసాగిస్తుందని భావిస్తున్నట్లు ఫలితాల విడుదల సందర్భంగా టాటా మోటార్స్‌ సీఈవో పి.బాలాజీ పేర్కొన్నారు. ఫేమ్‌(ఎఫ్‌ఏఎంఈ)2 పథకంలో భాగంగా ప్రభుత్వం దేశీయంగా ఈవీ తయారీకి ప్రోత్సాహకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే యూఎస్‌ ఆటో దిగ్గజం టెస్లా దేశీయంగా వాహన అమ్మకాలకు వీలుగా దిగుమతి సుంకాన్ని తగ్గించమని కోరుతున్న నేపథ్యంలో టాటా మోటార్స్‌ స్పందనకు ప్రాధాన్యత ఏర్పడినట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంజిన్‌ పరిమాణం, కారు ఖరీదు తదితరాల ఆధారంగా కార్ల దిగుమతుల్లో సీబీయూలపై 60–100 శాతం మధ్య కస్టమ్స్‌ డ్యూటీ అమలవుతోంది. వాహన దిగుమతుల్లో విజయవంతమైతే తదుపరి దేశీయంగా తయారీని ప్రారంభించగలమని టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ గత వారం ప్రకటించడం గమనార్హం!

ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1% క్షీణించి రూ. 293 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు