సఫారీ సరికొత్తగా.. కమింగ్‌ సూన్‌

7 Jan, 2021 16:16 IST|Sakshi

ఈ సారి 7 సీట్ల వేరియంట్‌  

త్వరలోనే బుకింగ్స్‌ మొదలు  

ఈ నెలలోనే షోరూమ్స్‌లోకి...

సాక్షి, న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ కంపెనీ సఫారీ ఎస్‌యూవీ(స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌)ని మళ్లీ మార్కెట్లోకి తెస్తోంది. ఆటో ఎక్స్‌పో 2020లో గ్రావిటాస్‌ కోడ్‌నేమ్‌తో ప్రదర్శించిన ఎస్‌యూవీనే సఫారీ పేరుతో భారత మార్కెట్లోకి ఈ కంపెనీ తెస్తోంది.  కొత్త తరం ఎస్‌యూవీ వినియోగదారుల కోసం ఈ ఏడు సీట్ల ఎస్‌యూవీని  రూపొందించామని, త్వరలోనే బుకింగ్స్‌ మొదలు పెడతామని, ఈ నెలలోనే షోరూమ్స్‌కు అందుబాటులోకి తెస్తున్నామని టాటా మోటార్స్‌ వెల్లడించింది. 

భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ వేరియంట్‌ కూడా...! 
ల్యాండ్‌ రోవర్‌కు చెందిన డీ8 ప్లాట్‌ఫార్మ్‌పై క్రయోటెక్‌ టర్బో–డీజిల్‌ ఇంజిన్‌తో ఈ కొత్త సఫారీని రూపొందించామని టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌ (ప్రయాణికుల వాహన వ్యాపార విభాగం) శైలేశ్‌ చంద్ర పేర్కొన్నారు. ఆల్‌–వీల్‌ డ్రైవ్, ప్రొజెక్టర్‌ హెడ్‌లైట్స్, ఎల్‌ఈడీ టెయిల్‌లైట్స్, 8.8 అంగుళాల ఫ్లోటింగ్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, జేబీఎల్‌ స్పీకర్లు....తదితర ఫీచర్లు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ వేరియంట్‌ను కూడా తెస్తామని వెల్లడించారు.  ప్రస్తుతం రూ.14-20 లక్షల రేంజ్‌లో ఉన్న ఐదు సీట్ల హారియర్‌ మోడల్‌ కన్నా ఈ సఫారీ ఎస్‌యూవీ ధర ఒకింత ఎక్కువ ఉండొచ్చు. ఎమ్‌జీ హెక్టర్‌ ప్లస్, మహీంద్రా ఎక్స్‌యూవీ 500, హ్యుందాయ్‌ క్రెటా ఆధారిత ఎస్‌యూవీలకు కొత్త సఫారీ గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.  

కొత్త సఫారీతో కొనసాగింపు..... 
భారత్‌లో ఎస్‌యూవీ లైఫ్‌స్టైల్‌ టాటా సఫారీతోనే మొదలైందని, ఇతర కంపెనీలు అనుసరించాయని  శైలేశ్‌ చంద్ర పేర్కొన్నారు. గత ఇరవైయేళ్లుగా హోదాకు, పనితీరుకు ప్రతీకగా టాటా సఫారీ నిలిచిందని, ఈ వైభవాన్ని కొత్త సఫారీతో కొనసాగిస్తామని వివరించారు.   

మరిన్ని వార్తలు