టాటా మోటార్స్‌–ఉబర్‌ భారీ డీల్‌

21 Feb, 2023 06:05 IST|Sakshi

25,000 ఎక్స్‌ప్రెస్‌–టి ఈవీల సరఫరా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ రంగంలో భారీ డీల్‌కు వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్, రైడ్‌ షేరింగ్‌ యాప్‌ ఉబర్‌ తెరలేపాయి. ఇరు సంస్థల మధ్య సోమవారం ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 25,000 యూనిట్ల ఎక్స్‌ప్రెస్‌–టి ఎలక్ట్రిక్‌ సెడాన్‌ వాహనాలను ఉబర్‌కు టాటా మోటార్స్‌ సరఫరా చేయనుంది. ఎక్స్‌ప్రెస్‌–టి ఈవీలను ప్రీమియం సేవల కింద ఉపయోగించనున్నట్టు ఉబర్‌ వెల్లడించింది. హైదరాబాద్‌సహా ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌ నగరాల్లో ఈ నెల నుంచే వీటిని నడుపుతామని తెలిపింది.  

దశలవారీగా డెలివరీలు..
‘ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ సరఫరా విషయంలో వాహన తయారీ కంపెనీ, రైడ్‌ షేరింగ్‌ సంస్థ మధ్య దేశంలో ఈ స్థాయి డీల్‌ కుదరడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి నుంచే దశలవారీగా ఉబర్‌ ఫ్లీట్‌ పార్ట్‌నర్స్‌కు డెలివరీలను టాటా మోటార్స్‌ ప్రారంభించనుంది. దేశంలో పర్యావరణ, స్వచ్ఛ వాహనాల వినియోగం పెరిగేందుకు ఈ డీల్‌ దోహదం చేస్తుందని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్, టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ఎండీ శైలేశ్‌ చంద్ర అన్నారు. ట్యాక్సీల కోసం ప్రత్యేకంగా ఎక్స్‌ప్రెస్‌ బ్రాండ్‌ను టాటా మోటార్స్‌ 2021 జూలైలో తెచ్చింది. ఈ బ్రాండ్‌ కింద ఎక్స్‌ప్రెస్‌–టి తొలి ఉత్పాదన. ఫేమ్‌ సబ్సిడీ పోను హైదరాబాద్‌ ఎక్స్‌షోరూం ధర.. ఎక్స్‌ప్రెస్‌–టి ఎక్స్‌ఎమ్‌ ప్లస్‌ రూ.13.04 లక్షలు, ఎక్స్‌టీ ప్లస్‌ రూ.13.54 లక్షలు ఉంది.

మరిన్ని వార్తలు