'ఫోర్డ్‌' చేతులెత్తేసింది, రంగంలోకి దిగిన రతన్‌ టాటా!

20 Mar, 2022 14:41 IST|Sakshi

ర‌త‌న్ టాటా..వెట‌రన్ పారిశ్రామిక‌వేత్త‌..పరిచయం అక్కర్లేని పేరు. వ్యాపార రంగంలో సంచ‌ల‌న‌, వినూత్న నిర్ణ‌యాల‌కు పెట్టింది ఆయ‌న‌ పేరు. ఇటీవల అప్పుల భారంతో కూరుకుపోయిన ఎయిరిండియాను రతన్‌ టాటాకు చెందిన టాటా గ్రూపు కొనుగోలు చేసింది. తాజాగా కోవిడ్‌తో దెబ్బకు దివాళా తీసే స్థితిలో ఉన్న అమెరికన్‌ ఆటోమొబైల్‌ సంస్థ 'ఫోర్డ్‌' యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. 

కరోనా క్రైసిస్‌లో సైతం టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటార్స్‌ మనదేశంలో  85 శాతం వెహికల్స్‌ను ఉత్పత్తి చేస్తుండగా..అమెరికాకు చెందిన ఫోర్డ్‌ కంపెనీ చేతులెత్తేసింది. ఈ మేరకు భారత్​లోని ఫోర్డ్​ కంపెనీ కార్ల ప్లాంట్లను మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో, సంసద్​(గుజరాత్​), చెన్నై (తమిళనాడు) నగరాల్లోని రెండు ప్లాంట్లను అమ్మకానికి పెట్టింది. అందులో సంసద్‌ యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు టాటా మోటార్స్‌ సిద్ధమైంది. కొనుగోళ్లలో భాగంగా సంసద్‌ యూనిట్‌ ప్రతినిధుల్ని టాటా గ్రూప్‌ సంప్రదించినట్లు తెలుస్తోంది. 

వచ్చేవారం గుజరాత్‌ సీఎం విజయ్​ రూపానీ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టాటా గ్రూప్‌.., ఫోర్డ్‌ యూనిట్‌లను కొనుగోలు ప్రతిపాదనలపై స్పష్టత రానుంది. ఒకవేళ అదే జరిగితే మరికొద్ది రోజుల్లో ఫోర్డ్‌ యూనిట్‌ను టాటా మోటార్స్‌ హస్తగతం చేసుకోనుంది. ఇక గుజరాత్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను టాటాకు అమ్మిన తర్వాత.. పీఎల్‌ఐ స్కీమ్‌లో ఫోర్డ్‌ పెట్టుబడులు పెట్టనుందని తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందేనని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

చదవండి:  ఆ యుద్ధం.. వీళ్ల ప్రేమకు శాపంగా మారింది 

మరిన్ని వార్తలు