సూపర్ ఐడియా బాసూ.. అద్దె కోసం హెలికాప్టర్‌గా టాటా నానో కారు!

21 Feb, 2022 18:20 IST|Sakshi

ఇటీవల కాలంలో కోడళ్ళను అత్తారింటికి తీసుకెళ్ళడానికి, పెళ్లి మండపానికి చేరుకోవడానికి చాలా మంది హెలికాఫ్టర్లు బుక్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సౌకర్యం కొందరు డబ్బున్నోళ్లకు మాత్రమే కుదరుతుంది. మధ్యతరగతి కుటుంబాలకు హెలికాప్టర్‌ అద్దెకు తీసుకోవడం అనేది ఓ కలగానే ఉండిపోతుంది. సరిగ్గా ఈ వ్యాపారాన్ని టార్గెట్​ చేశాడు బీహార్ రాష్ట్రంలోని భగా సిటీకి​ చెందిన మెకానిక్ గుడ్డు శర్మ. మధ్యతరగతి వాళ్లు కూడా పెళ్లిళ్లకు హెలికాప్టర్‌ను అద్దెకు ఇచ్చేందుకు గుడ్డు శర్మ డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం తన టాటా నానో కారును హెలికాప్టర్‌గా మార్చేశాడు. 

ప్రస్తుతం టాటా నానో కారును హెలికాఫ్టర్​గా మార్చి దానిని రూ.15 వేలకు అద్దెకు ఇస్తున్నాడు. తక్కువ ధరకే హెలికాఫ్టర్​ సేవలు అందుతుండటంతో అతడికి ఆర్డర్లూ పెరుగుతున్నాయి. ఈ వార్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఈ ప్రత్యేకమైన టాటా నానో కారుకి చెందిన కొన్ని చిత్రాలు వైరల్ అయ్యాయి. ఈ పాత నానో కారును హెలికాప్టర్‌గా మార్చడానికి సుమారు ₹2 లక్షలు ఖర్చు చేసినట్లు గుడు శర్మ పేర్కొన్నారు. కారును హెలికాప్టర్‌గా సిద్ధం చేయడానికి కొన్ని ప్రత్యేక సెన్సార్ల వినియోగించినట్లు పేర్కొన్నాడు.
 

'వివాహా సమయంలో హెలికాప్టర్లను బుక్ చేసుకోవడం కోసం ప్రజలలో చాలా ఉత్సాహం ఉంది. ఇక్కడ వాటి సేవలకు డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా మంది హెలికాప్టర్ ద్వారా తమ వివాహానికి వెళ్లాలని కోరుకుంటారు. కానీ అధిక ఛార్జీల కారణంగా ఇది అందరికీ సాధ్యం కాదు. అందుకే నేను నా టాటా నానో కారును మార్పు చేర్పులు చేసి హెలికాప్టర్ డిజైన్ ఇచ్చాను. ఈ హెలికాప్టర్‌ సహాయంతో పేద ప్రజలు తమ అభిరుచిని తక్కువ మొత్తానికి నెరవేర్చకొగలరు" అని శర్మ అన్నారు. ఈ డిజిటల్ ఇండియా యుగంలో గుడ్డు శర్మ చేసిన ఈ ఆవిష్కరణ స్వావలంబన భారతదేశానికి సజీవ ఉదాహరణ. కాగా, గతంలో బీహార్ రాష్ట్రంలోని ఛప్రా గ్రామానికి చెందిన మిథిలేష్ ప్రసాద్ అనే వ్యక్తి కూడా పైలట్ కావాలని కలలు కన్నాడు. కానీ దానిని కాలేకపోయాడు. దీంతో తన నానో కారును హెలికాప్టర్‌గా మార్చి దానికి తనే పైలట్'గా మారిపోయాడు.

మరిన్ని వార్తలు