టాటా మోటార్స్ దూకుడు.. ఇక ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ తగ్గేదె లే!

23 Jan, 2022 14:31 IST|Sakshi

ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల విషయంలో మరింత దూకుడు ప్రదర్శించేందుకు సిద్దం అవుతుంది. ఎలక్ట్రిక్‌ వాహన వినియోగదారుల్లో ఎంతో ఆసక్తి రేపి ఆ తర్వాత వివాదాల్లో చిక్కుకున్న నెక్సాన్‌ మోడల్‌కి సంబంధించి టాటా తీపి కబురు చెప్పబోతుంది. ఈ మోడల్‌కి సంబంధించిన రేంజ్ విషయంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అంతర్జాతీయ ఈవీలకు దీటుగా ఈ నెక్సాన్‌ కారును రూపొందిస్తుంది.

రేంజ్
వినియోగదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని బ్యాటరీ సామర్థ్యం పెంచాలని టాటా నిర్ణయించింది. ప్రస్తుతం టాటా నెక్సాన్‌లో 30.2 కిలోవాట్ల బ్యాటరీని 40 కిలోవాట్లకు పెంచాలని నిర్ణయించారు. దీంతో కనీసం ప్రయాణ రేంజ్‌ కనీసం 30 శాతం పెరుగుతుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ సామర్థ్యం పెంచిన తర్వాత టాటా మోటార్స్‌ చేపట్టిన ఇంటర్నల్‌ టెస్ట్‌లో కారు సింగిల్‌ రేంజ్‌ కెపాసిటీ 400 కిలోమీటర్ల వరకు ఉన్నట్టు అంచనా. అయితే రియల్‌టైంలో ఆన్‌రోడ్‌ మీద కనీసం 300 కిలోమీటర్ల నుంచి 320 కిలోమీటర్ల వరకు రేంజ్ రావచ్చని తెలుస్తోంది. ఈ మార్పులు చేసిన కొత్త కారు ఈ ఏడాది ద్వితియార్థంలో మార్కెట్లోకి రావచ్చని అంచనా.

సేల్స్
రాబోయే ఆర్థిక సంవత్సరంలో 50,000కు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయాలని సంస్థ యోచిస్తోంది. కంపెనీ తన ఈవీ కార్ల ఉత్పత్తిని రాబోయే రెండు సంవత్సరాలలో వార్షికంగా 1,25,000-150,000 యూనిట్లకు పెంచుకోవాలని చూస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లక్ష్య కార్లను విక్రయించగలిగితే కంపెనీ మొత్తం రూ.5,000 కోట్ల ఆదాయాన్ని సంపాదించనుంది. అలాగే, రాబోయే కాలంలో టాటా మోటార్స్ దేశంలో మరో మూడు సరసమైనఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించాలని యోచిస్తుంది.
 

రూ.10 లక్షల లోపు ధరలో ఎలక్ట్రిక్ కార్లను తీసుకొని రావాలని చూస్తున్నట్లు సమాచారం. టియాగో ఈవీ, పంచ్ స్మాల్ ఎస్‌యువీ, ఆల్ట్రోజ్ హ్యాచ్ బ్యాక్ ఎలక్ట్రిక్ కార్లు రూ.10 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది. అలాగే, ఈ ఎలక్ట్రిక్ కార్ల కనీస రియల్ రేంజ్ అనేది 200 కిలోమీటర్ల మార్కుకు తగ్గకుండా ఉండాలని చూస్తోంది. ఏడాదికి కనీసం 1 లేదా 2 కార్లను లాంచ్ చేయలని చూస్తోన్నట్లు సంస్థ పేర్కొంది.

(చదవండి: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!)

మరిన్ని వార్తలు