Tata Power Group Q1 Results: టాటా పవర్‌.. డబుల్‌ ధమాకా!

27 Jul, 2022 11:48 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ విద్యుత్‌ దిగ్గజం టాటా పవర్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 90 శాతం జంప్‌చేసి రూ. రూ. 884 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 466 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 10,310 కోట్ల నుంచి రూ. 14,639 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 9,480 కోట్ల నుంచి రూ. 14,660 కోట్లకు భారీగా పెరిగాయి. ఈ ఏడాది రూ. 14,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా వెల్లడించింది. వీటిలో రూ. 10,000 కోట్లను పునరుత్పాదక ఇంధన విభాగంపై ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు పేర్కొంది.  

సోలార్‌ సెల్‌ ప్లాంట్‌ 
4 గిగావాట్ల సోలార్‌ సెల్, మాడ్యూల్‌ ప్లాంటు ఏర్పాటుకు తమిళనాడు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు టాటా పవర్‌ తాజాగా తెలియజేసింది. ఇందుకు రూ. 3,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 5,524 మెగావాట్లుకాగా.. దీనిలో స్థాపిత సామర్థ్యం 3,634 మెగావాట్లు. మరో 1,890 మెగావాట్ల యూనిట్లు వివిధ అభివృద్ధి దశలలో ఉన్నాయి. మరోవైపు వివిధ రాష్ట్రాలలో 75,000 సోలార్‌ పంపులను ఏర్పాటు చేసింది. విద్యుత్‌ ప్రసారం, పంపిణీ విభాగంలో ఎన్‌ఆర్‌ఎస్‌ఎస్‌ ట్రాన్స్‌మిషన్‌ను(100 శాతం వాటా) సొంతం చేసుకుంది. ఫలితాల నేపథ్యంలో టాటా పవర్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3 శాతం నష్టంతోరూ. 226 దిగువన ముగిసింది.

చదవండి: అక్రమ నిర్మాణం..వందల కోట్లకు ఇంటిని అమ్మేసిన మార్క్‌ జుకర్‌ బర్గ్‌! 

మరిన్ని వార్తలు