టాటా పవర్‌ లాభం ప్లస్‌

4 Feb, 2023 06:35 IST|Sakshi

క్యూ3లో రూ. 1,052 కోట్లు

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ విద్యుత్‌ దిగ్గజం టాటా పవర్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం దాదాపు రెట్టింపై రూ. 1,052 కోట్లను అధిగమించింది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 552 కోట్లు మాత్ర మే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 11,019 కోట్ల నుంచి రూ. 14,402 కోట్లకు ఎగసింది.

ఈ కాలంలో హరిత ఇంధనం, విద్యుత్‌ ప్రసారం, పంపిణీ తదితర విభిన్న బిజినెస్‌లలో ప్రస్తావించదగ్గస్థాయిలో అడుగులు వేసినట్లు కంపెనీ సీఈవో, ఎండీ ప్రవీర్‌ సిన్హా పేర్కొన్నారు. పునరుత్పాదకాలు, ఒడిషా వి ద్యుత్‌ పంపిణీలలో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. రూఫ్‌టాప్‌ సోలార్, ఈవీ చార్జింగ్‌ విభాగాలను మరింత పటిష్టం చేస్తున్నట్లు తెలియజేశారు. టాటా పవర్‌ సోలార్‌ సిస్టమ్స్‌ రూ. 15,440 కోట్ల విలువైన 3.9 గిగావాట్ల థర్డ్‌పార్టీ ప్రాజెక్టులతో కలిపి ఆర్డర్లను కలిగి ఉన్నట్లు వెల్లడించారు.
 
ఫలితాల నేపథ్యంలో టాటా పవర్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.4 శాతం నీరసించి రూ. 206 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు