టాటా ప్రాజెక్ట్స్‌ చేతికి నోయిడా ఎయిర్‌పోర్ట్‌

4 Jun, 2022 06:16 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విభిన్న రంగాల్లో ఉన్న టాటా గ్రూప్‌ కంపెనీ, మౌలిక రంగ నిర్మాణ సంస్థ టాటా ప్రాజెక్ట్స్‌ తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ కాంట్రాక్ట్‌ను చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా టెర్మినల్, రన్‌వే, ట్యాక్సీవే, రోడ్లు, విద్యుత్, మంచినీటి ఏర్పాట్లు, అనుబంధ భవనాలను టాటా ప్రాజెక్ట్స్‌ నిర్మించాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి ప్రాజెక్టును 2019లో స్విస్‌ డెవలపర్‌ జ్యూరిక్‌ ఎయిర్‌పోర్ట్‌ ఇంటర్నేషనల్‌ ఏజీ దక్కించుకుంది.

విమానాశ్రయ అభివృద్ధికై యమునా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (వైఐఏపీఎల్‌) పేరుతో స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ను ఏర్పాటు చేసింది. 1,334 హెక్టార్ల విస్తీర్ణంలో విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. తొలి దశలో ఒకే రన్‌వేతో ఏటా 1.2 కోట్ల మందికి సేవలు అందించే సామర్థ్యంతో రూ.5,700 కోట్ల పెట్టుబడితో ఇది రానుంది. 2024లో విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.   

మరిన్ని వార్తలు