రూ.5882 కోట్ల భారీ పెట్టుబడితో వస్తోన్న టాటా న్యూ

9 Apr, 2022 13:01 IST|Sakshi

ఈ కామర్స్‌ రంగం ఊహించని వేగంతో వృద్ధి చెందుతోంది. ఇప్పటికే ఇక్కడ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పాతుకుపోగా స్నాప్‌డీల్‌ క్రమంగా తెరమరుగైపోతుంది. మరోవైపు అజియో, మీషో వంటి సంస్థలు ఆకట్టుకునే ఆఫర్లతో బిగ్‌ ప్లేయర్లతో పోటీ పడుతున్నాయి. ఈ తరుణంలో ఈ కామర్స్‌ రంగంలోకి అడుగుపెట్టింది టాటా. న్యూ పేరుతో సరికొత్త యాప్‌ని లాంచ్‌ చేసింది.

టాటా పోర్ట్‌ఫోలియోలో ఒక ఈ కామర్స్‌ యాప్‌ ఉండాలి అన్నట్టుగా కాకుండా భారీ ప్రణాళికతోనే టాటా గ్రూపు ప్రవేశించింది. తాజాగా ఆ కంపెనీ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీకి దాఖలు చేసిన పత్రాలు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. టాటా డిజిటల్‌ విస్తరణకు ఏకంగా రూ.5882 కోట్లు కేటాయించినట్టు టాటా పేర్కొంది.

ఇంతకుముందే టాటా డిజిటల్‌ కింద 1 ఎంజీ, టాటాక్లిక్‌ , టాటా క్రోమా వంటి అనేక సంస్థలు ఉన్నా ఈ కామర్స్‌లో పెద్దగా ప్రభావం చూపలేదు. కొన్ని కంపెనీలయితే బ్రాండ్‌ వాల్యూ మీదే నడుస్తూ వచ్చాయి తప్పితే కొత్త కష్టమర్లను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ లోటు తీర్చేందుకే న్యూ పేరుతో టాటా సరికొత్త ఈ కామర్స్‌ యాప్‌ని తెచ్చింది.

గతంలో తరహాలో కాకుండా ఈ సారి భారీ పెట్టుబడితో టాటా రావడం ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనంగా మారింది. ఎన్నడూ లేనంతగా టాటా డిజిటల్‌ ద్వారా ‘న్యూ’ కోసం భారీ స్థాయిలో రూ.5,882 కేటాయించింది. దీంతో ఈ కామర్స్‌ సెక్టార్‌లో కుంభస్థలం కొట్టే ప్రణాళికలో టాటా ఉన్నట్టు తెలుస్తోంది. 

చదవండి: వచ్చేసింది..గూగుల్‌ పే, ఫోన్‌ పే యాప్స్‌కు పోటీగా టాటా పే...!
 

మరిన్ని వార్తలు